వనరుల విధ్వంసం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత బత్తలపల్లి మండలంలో ‘పచ్చ’మూక అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. కొండలు, గుట్టలను స్వాహా చేసేస్తున్నారు. మాఫియాగా ఏర్పడి వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. అక్రమంగా రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారు.
గ్రావెల్ దందా
బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి, అప్పరాచెరువు గ్రామాల చెరువులు, గుట్టల్లో 20 అడుగుల మేర తవ్వేసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. 15 శాతం మేర కమీషన్లు రూపంలో వాటాలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రామాపురం, కోడేకండ్ల, గరిశలపల్లి, ఉప్పర్లపల్లి, ఓబుళాపురం దంపెట్ల గ్రామాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ యంత్రాల సాయంతో ఇసుక తవ్వేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు, హిటాచీలతో ఇసుక తోడేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టరుకు నెలకు రూ.5 వేల చొప్పున ఓ శాఖ అధికారులకు ముడుపులు అందిస్తున్నట్లు టీడీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. కేవలం ఇసుక, మట్టిలోనే కాకుండా బొగ్గులు కాల్చేవారితోనూ టీడీపీ నేతలు భారీగా దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దందా విషయంలో టీడీపీ లోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం, కిడ్నాప్ చేయడం, దీనిపై కేసులు నమోదై జైలుకు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎవరూ ఏమీ చేయలేరట...
గత నెలలో మండలంలోని పోట్లమర్రి గ్రామంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య మట్టి తరలించే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ వర్గీయులు గ్రామ కట్టుబాటు మేరకు చెరువులో మట్టిని రైతులకు తరలిస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోగా వైఎస్సార్‌సీపీ వర్గీయులపై అధికారులు కేసులు పెట్టారు. అదే టీడీపీ నేతలు ఆదివారం మళ్లీ గ్రామ చెరువులో హిటాచీ పెట్టి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించడం గమనార్హం. గ్రామస్తులు దీనిపై ప్రశ్నిస్తే ‘మాకు కలెక్టర్, ఎస్పీ నుంచి అనుమతులు వచ్చాయి. ఎవరూ ఏమీ చేయలేరు. అడ్డుపడితే వైఎస్సార్‌సీపీ వాళ్లకు పట్టిన గతే మీకూ పడు తుంది’ అని హెచ్చరించినట్లు సమాచారం. ధర్మవరం ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ స్వర్ణలత పోట్లమర్రి చెరువును గత నెలలో పరిశీలించి అనుమతులు లేకుండా మట్టిని తరలించవద్దని చేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ మళ్లీ యథేచ్ఛగా తరలిస్తున్నా ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. అప్పరాచెరువులో పాఠశాల ముందు నుంచి మట్టి టిప్పర్లు వేగంగా వెళ్తుండడంతో గ్రామస్తులు తమ పిల్లలను బడికి పంపాలన్నా భయపడుతున్నారు. రెవెన్యూ, పోలీసులు, ఇరిగేషన్ అధి కారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బత్తలపల్లి మండలంలో
రెచ్చిపోతున్న ఇసుక, మట్టి మాఫియా
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు


