వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలవ్వాలి
ప్రశాంతినిలయం: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం విద్యాశాఖ అధికారులు, హాస్టల్ వార్డెన్లు, ఎంఈఓలు, హెచ్‌ఎంలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్లిప్ టెస్టుల్లో సీ,డీ గ్రేడులు సాధించిన విద్యార్థులను 45 రోజుల పాటు హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రెడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
రైతును నష్టపరిచిన నకిలీ విత్తనం
కనగానపల్లి: వ్యాపారుల మాటలు నమ్మి, వారు అంటగట్టిన నకిలీ విత్తనాలతో పంట సాగు చేపట్టి కనగానపల్లి మండలం ముత్తువకుంట గ్రామానికి చెందిన రైతు ఎం.నారాయణ మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. రైతు నారాయణ అనంతపురంలోని వినాయక ట్రేడర్స్ నిర్వాహకుడి మాటలు నమ్మి రూ.35 వేలు చెల్లించి పీహెచ్‌ఎస్– ప్లస్ అనే కళింగర విత్తనాలు కొనుగోలు చేసి, తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. తర్వాత వివిధ దశల్లో రూ.4 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాడు. నీరు సమృద్ధిగా అందించడంతో పంట ఏపుగా పెరిగి 90 రోజుల్లోనే కోతకు వచ్చింది. అయితే కాయ కోసి చూస్తే తెల్లగా బెండు బారిపోయి కనిపించింది. కాయలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు పంట కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని విత్తనం విక్రయించిన వ్యాపారితో పాటు విత్తన తయారీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళితే వారి నుంచి స్పందన లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. 13 టన్నుల దిగుబడి పొలంలోనే ఉండిపోయిందని, రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. అధికారులు స్పందించి నకిలీ విత్తనం అంటగట్టిన వ్యాపారిపై చర్యలు తీసుకుని తనకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.
పోలీసుల అదుపులో
నకిలీ పత్రాల సృష్టికర్తలు!
పుట్టపర్తి టౌన్: ఓ గృహాన్ని అక్రమంగా కొట్టేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం నగరంలోని శారద నగర్‌లో కనకదర్గ అనే సత్యసాయి భక్తురాలు 1980 సంవత్సరంలో 6.43 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. సత్యసాయి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె పదవీ విరమణ తరువాత తన సోదరి శ్రీలక్ష్మితో కలసి శారదానగర్‌లో నివసించేవారు. వ్యక్తిగత పని నిమిత్తం గత ఏడాది నవంబర్‌లో రాజమండ్రికి వెళ్లిన కనకదుర్గ, శ్రీలక్ష్మిలు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలోనే అనంతపురం నగరానికి చెందిన ఓ టీడీపీ నేత వారి ఇంటిని కొట్టేసేందుకు పన్నాగం పన్నాడు. కనకదుర్గ జీవించి ఉన్న సమయంలో హిందూపురం ప్రాంతానికి చెందిన శకుంతల ఆమె బాగోగులు చూసిందని, అందుకు ప్రతిఫలంగా తన ఇంటిని ఆమెకు రాసివ్వగా.. శకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ. శేఖర్‌కు జీపీఏ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కనకదుర్గ బంధువులు అనంతపురం ఎస్పీని ఆశ్రయించారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ అనంతరం నకిలీ పత్రాలు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులు ఆవుల సుబ్రమణ్యం, దయ్యాల ఉమాపతి, శేఖర్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలవ్వాలి
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలవ్వాలి


