బస్సు కింద పడి డిగ్రీ విద్యార్థి మృతి
పుట్టపర్తి అర్బన్: కాలేజీ ముగిసిన తర్వాత ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తూ ప్రమాదవశాత్తూ బస్సు దిగే సమయంలో కిందపడటంతో డిగ్రీ విద్యార్థి సాయి కిరణ్ (19) మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లో గురువారం చోటు చేసుకుంది. పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ క్రాంతి వివరాలమేరకు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లికి చెందిన ప్రభాకర్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయికిరణ్ కొత్తచెరువులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బస్సు దిగే క్రమంలో కింద పడిన సాయికిరణ్‌పై బస్సు ఎక్కింది. తీవ్రంగా గాయపడిన సాయికిరణ్‌ను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో బీడుపల్లిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివించాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారని, దేవుడు వారికి తీరని అన్యాయం చేశాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డీపీటీఓ మధుసూదన్, ఎస్‌ఐ క్రాంతి ఆస్పత్రికెళ్లి వివరాలను నమోదు చేసుకున్నారు. తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


