దారి వెంట నీరాజనం..
చిలమత్తూరు: అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు బయలుదేరిన మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారి పొడవునా జనం నీరాజనం పలికారు. హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఉదయమే బాగేపల్లి టోల్‌ప్లాజ్ వద్దకు వేలాదిగా చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ రాకకోసం నిరీక్షిస్తూ గడిపారు.
వైఎస్ జగన్ కాన్వాయ్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ‘జై జగన్’ అంటూ నినదిస్తూ జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. తనకోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి వైఎస్ జగన్ కారులో నుంచే వారికి అభివాదం చేసుకుంటూ.. నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. అభిమాన తరంగం వెంట రాగా వైఎస్ జగన్ కొడికొండ చెక్‌పోస్ట్, కోడూరు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి క్రాస్, మీదుగా కల్లితండా చేరుకున్నారు. యువత భారీ బైక్ ర్యాలీతో కల్లితండా వరకూ జగన్ కాన్వాయ్‌ను అనుసరించింది.
తిరుగు ప్రయాణంలోనూ అదే అభిమానం..
మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుమార్గంలో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. బెంగళూరు మార్గంలోని దారికి ఇరువైపులా నిలబడి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానం చూపారు.


