హద్దు దాటిన బియ్యం దందా
● ఈనెల 28న ధర్మవరం నుంచి 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బెంగళూరు తీసుకెళ్తున్నట్లు సమాచారంతో ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు ఎర్రగుంట్ల సర్కిల్‌లో పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేసి.. డ్రైవర్ బాబావలిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు జూన్ 9వ తేదీన బత్తలపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వీటిని కిలో రూ.18 చొప్పున కార్డుదారుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
● ఈ ఏడాది జూలై 23వ తేదీన చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి బస్టాప్ వద్ద ఆటోల్లో తెచ్చిన రేషన్ బియ్యం.. లారీల్లోకి మార్చే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో హల్‌చల్ చేశాయి. వాటాల్లో తేడా రావడంతో ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆ తర్వాత పోలీసులతో పాటు పలువురికి వాట్సాప్ ద్వారా పంపించారు. అంతకుముందు మే 8వ తేదీన సోమందేపల్లి జాతీయ రహదారిపై 4 టన్నుల రేషన్ బియ్యాన్ని ధర్మవరం నుంచి బెంగళూరు తరలిస్తుండగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, పుట్టపర్తి
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరాక కొందరు నాయకులు మాఫియాగా ఏర్పడి.. రేషన్ బియ్యం దందానే జీవనోపాధిగా మార్చుకున్నారు. తక్కువ ధరకు పేదల నుంచి కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రం కర్ణాటక తరలించి సన్నబియ్యంగా మార్చి మళ్లీ పేదలకే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యం దందాలో అంతా పచ్చ పార్టీ నేతలే ఉండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
మంత్రుల ఇలాకాలో...
మంత్రులు సవిత, సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లోనే రేషన్ బియ్యం దందా అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు సిండికేటుగా మారి.. ఎవరినీ రానీయకుండా.. కేవలం ఒకరిద్దరి కనుసన్నల్లోనే దందా సాగుతోందని సమాచారం. సోమందేపల్లికి చెందిన ఓ కూటమి కార్యకర్త.. అతడి అనుచరులు ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి రాత్రి వేళల్లో ఎన్‌ఎస్ గేటు, పెనుకొండ, కొడికొండ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలిసింది. అక్రమార్కులకు మంత్రుల అండదండలు ఉండటంతో పోలీసులు కూడా వాహనాలను పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే కమీషన్లు ఇవ్వని సమయంలో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
సరిహద్దు దాటిపోతున్నా..
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఒక చోట నిల్వ ఉంచి.. పెనుకొండ, సోమందేపల్లి, రామగిరి మీదుగా కర్ణాటక తరలిస్తున్నారు. జిల్లాలో 32 మండలాలు ఉండగా.. 16 మండలాలకు కర్ణాటక సరిహద్దు ఉండటంతో రేషన్ బియ్యాన్ని సులువుగా సరిహద్దు దాటిస్తున్నారు. ధర్మవరం, నల్లమాడ, కొత్తచెరువు ప్రాంతాల నుంచి పెనుకొండ, సోమందేపల్లి మీదుగా కర్ణాటక వెళ్తున్నట్లు సమాచారం. అడపాదడపా అక్కడక్కడా పోలీసులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటున్నా...రేషన్ బియ్యం దందా అంతా పచ్చ నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు అన్నీ తెలిసినా కళ్లు మూసుకుని నల్లబజారుకు చౌక బియ్యం తరలిపోయేందుకు అవకాశం ఇస్తున్నారు.
ప్రతి నెలా రూ.కోట్లలో..
కూటమిలోని కొందరు నేతలు రేషన్ బియ్యంపైనే ఆధారపడి బతుకుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులంతా కలిసి సిండికేటుగా మారి ప్రతి నెలా రూ.కోట్లలో ఆదాయం పొందుతున్నారు. జిల్లాలోని పేదల నుంచి కిలో రూ.18 చొప్పున కొనుగోలు చేస్తున్న నేతలు..వాటిని కర్ణాటకలోని కొన్ని రైస్ మిల్లులకు తరలించి అక్కడ పాలిష్ చేసి మళ్లీ పేదలకే కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా జిల్లా పరిధిలో రేషన్ బియ్యం దందాలో ప్రతి నెలా రూ.3 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా వారికి వెళ్లినా.. ఒక్కో వ్యక్తికి సగటున రూ.5 లక్షల వరకు మిగులుతున్నట్లు తెలుస్తోంది.
హద్దు దాటిన బియ్యం దందా
హద్దు దాటిన బియ్యం దందా
హద్దు దాటిన బియ్యం దందా


