మట్టి అక్రమ తరలింపును అడ్డుకోండి
సోమందేపల్లి: ‘‘టీడీపీ నాయకుల మట్టి తవ్వకాలతో మాగేచెరువు పంచాయతీ కొత్తపల్లి చెరువు రూపురేఖలు కోల్పోయింది. వారి ధన దాహానికి వేలాది మందికి నీరిచ్చే చెరువు ఉనికి కోల్పోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొత్తపల్లి చెరువును కాపాడండి’’ అంటూ గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి సోమవారం ధర్నా చేశారు. ‘‘సవితమ్మా మా చెరువును కాపాడమ్మా’’ అంటూ గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్... టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. కొత్తపల్లి చెరువుతో పాటు సమీపంలోని శ్మశాన వాటిక వద్ద కూడా మట్టి తరలిస్తున్నారంటే టీడీపీ నేతల మట్టి దోపిడీ ఎంతలా జరగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి సవిత అండతోనే మట్టి తరలింపు యథేచ్చగా కొనసాగుతోందన్నారు. మట్టి తవ్వకాలపై గతంలో ప్రశ్నించిన సీపీఐ నేతలతో పాటు పాత్రికేయులపై మంత్రి సవిత అనుచరులు దాడులకు పాల్పడి ఫోన్లు లాకున్నా... పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. టీడీపీ నేతల అక్రమ సంపాదనకు చెరువులో గుంతలు ఏర్పడ్డాయని, ఇదిలాగే కొనసాగితే చెరువు ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. కొత్తపల్లి చెరువు నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా మట్టి తరలింపు అడ్డుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి శేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు గజేంద్ర, శ్రీనివాసులు, సర్పంచ్‌లు అంజి నాయక్, కిష్టప్ప, వైస్ సర్పంచ్ వేణు, ఎంపీటీసీ నాగప్ప, నాయకులు నర్సింహులు, మంజు, నరసింహమూర్తి, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సవిత అనుచరుల బారి నుంచి
కొత్తపల్లి చెరువును కాపాడండి
గ్రామస్తులతో కలిసి వైఎస్సార్ సీపీ ఆందోళన
టీడీపీ నేతలు శ్మశానాలనూ వదలడం లేదని ఉషశ్రీ చరణ్ ఆగ్రహం
మట్టి అక్రమ తరలింపును అడ్డుకోండి


