మట్టి బొక్కుడు.. పట్టా పట్టుడు!
పుట్టపర్తి అర్బన్: అధికారంలోకి వచ్చీ రాగానే ‘పచ్చ’ నేతలు...అడ్డమైనా మేత మేస్తున్నారు. చివరకు మట్టినీ బొక్కుతున్నారు. పచ్చకండువాలు చూసి అధికారులు కూడా అడ్డుకోకపోవడంతో వారి ధన దాహానికి కొండలు కరిగిపోతున్నాయి.
ముఖ్య ప్రజాప్రతినిధి అండతోనే..
కొత్తచెరువు మండలంలోని కదిరేపల్లి రెవెన్యూ పొలంలో వందలాది ఎకరాల్లో కనుమ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ గుట్టలు వెంకటగారిపల్లి, బీడుపల్లి, బత్తలపల్లి, గువ్వలగుట్టపల్లి గ్రామాల మధ్యలో ఉన్నాయి. ఈ క్రమంలో స్థానిక పచ్చ నేతలు ముఖ్య ప్రజాప్రతినిధి అండతో కదిరేపల్లి రెవెన్యూ గ్రామ పొలంలోకి వచ్చే గంటల మారెమ్మ కనుమను చెరబట్టారు. కనుమ ప్రాంతంలో ఎర్రమట్టి ఉండటం, సమీపంలోనే జాతీయ రహదారి ఉండటంతో పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. కనుమలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిగి మట్టిని తవ్వతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో గుంతలు పూడ్చడానికి ఎర్ర మట్టి వినియోగిస్తుండటంతో మట్టి మాఫియాకు కాసులు కురుస్తున్నాయి. ఒక్కో టిప్పర్ మట్టి రూ.4 వేలతో విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మట్టి మాఫియా దెబ్బకు కనుమ కనుమరుగవుతుండగా... రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండటంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న మామిడి చెట్లు, ఇతర పంటలు దుమ్ముపట్టి నాశనం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
చదును చేసి పట్టా కోసం ప్రయత్నం..
కనుమను తవ్వి మట్టి తవ్వుకుని తరలిస్తున్న పచ్చ నేతలు...ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని చదును చేసిన భూమికి పొజిషన్ సర్టిఫికెట్లు సంపాదించి పట్టాలు తీసుకునే పన్నాగం పన్నుతున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని సాగులో ఉన్నామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కనుమ ప్రాంతం అటు కొత్తచెరువు, ఇటు పుట్టపర్తి మండలాల సరిహద్దులో ఉండటంతో ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియక ప్రజలు సందిగ్ధంలో పడిపోయారు.
గంటల మారెమ్మ కనుమలో
భారీగా మట్టి తవ్వకాలు
పగలు, రాత్రి తేడా లేకుండా
అక్రమ రవాణా
టిప్పర్ మట్టి రూ.4 వేలతో విక్రయం
తవ్వకాలు చేసిన భూమిని చదును చేసి పట్టాల కోసం ప్రయత్నం
మట్టి బొక్కుడు.. పట్టా పట్టుడు!


