శంకర్‌దాదాలు.. గాల్లో ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

శంకర్‌దాదాలు.. గాల్లో ప్రాణాలు

Dec 29 2025 9:14 AM | Updated on Dec 29 2025 9:14 AM

శంకర్‌దాదాలు.. గాల్లో ప్రాణాలు

శంకర్‌దాదాలు.. గాల్లో ప్రాణాలు

సాక్షి, పుట్టపర్తి: అర్హత ఉండదు, అనుమతులు ఉండవు అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగే వారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఆ విషయమే మరచిపోవడంతో ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గత్యంతరం లేక, స్థానికంగా అందుబాటులో ఉందనే ఉద్దేశంతో తమ వద్దకు వస్తున్న వారికి చుక్కలు చూపుతున్నారు.

ఉదంతాలెన్నో..

జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోగుల అమాయకత్వాన్ని ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌ వద్దనే ల్యాబ్‌, ఫార్మసీ కూడా ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల పలు చోట్ల ఆర్‌ఎంపీలు చేసిన వైద్యం వికటించి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్నారులు, బాలింతలు ఇబ్బందులు పడిన ఉదంతాలు వెలుగుచూశాయి. దీనికితోడు సమీప పట్టణాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల వారితో ఆర్‌ఎంపీలు కుమ్మకై ్క రోగులను అక్కడికి పంపిస్తూ కమీషన్‌ రూపంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కొందరు వైద్యులదీ అదే దారి..

జిల్లాలో చాలా చోట్ల ప్రైవేటు క్లినిక్‌లను ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి స్పెషలైజేషన్‌ లేకున్నా.. అన్ని రకాల రోగాలకు వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం ప్రబలుతున్న నేపథ్యంలో చాలా మంది చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లల డాక్టర్లు కానప్పటికీ కొందరు వారికి వైద్యం చేస్తుండడం ఆందోళన కల్గిస్తోంది.

ప్రైవేటు ల్యాబ్‌లు 68

స్కానింగ్‌ కేంద్రాలు 66

ప్రైవేటు ఆస్పత్రులు 165

అనుమతులు లేకుండా

నిర్వహిస్తున్న క్లినిక్‌లు 1,000కి పైగా

ఆర్‌ఎంపీలు 1,000 మంది దాకా

జిల్లా గణాంకాలు

ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం

అర్హతకు మించి రోగులకు వైద్యం

అమాయకుల ప్రాణాలతో చెలగాటం

వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంపై

విమర్శల పర్వం

ఎన్‌పీకుంట మండల కేంద్రంలో వెంకటేశ్వర ప్రథమ చికిత్స కేంద్రాన్ని బాలాజీ అనే ఆర్‌ఎంపీ నిర్వహిస్తున్నాడు. పది రోజుల క్రితం రామచంద్ర అనే బైక్‌ మెకానిక్‌ జ్వరంతో బాధపడుతూ ఈ ప్రథమ చికిత్సా కేంద్రానికి వెళ్లాడు. రామచంద్రకు ఆర్‌ఎంపీ బాలాజీ ఇంజెక్షన్‌ వేయగా, అది వికటించి శరీరంలో గడ్డలు ఏర్పడ్డాయి. బాధిత కుటుంబీకులు రామచంద్రను కదిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తూ చిన్న పిల్లలకు వైద్యం చేస్తున్న డాక్టర్‌ గుర్రం కిరణ్‌కుమార్‌ను గతంలో కొత్తచెరువు పోలీసులు అరెస్టు చేశారు. వైద్య,ఆరోగ్య శాఖాధికారులు సదరు ఆస్పత్రిని సీజ్‌ చేశారు. ఈ రెండే కాదు.. జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల కొందరు ఆర్‌ఎంపీలు, డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

నిబంధనలు పాటించాల్సిందే

ఆర్‌ఎంపీలు నిబంధనలు పాటించాలి. జిల్లావ్యాప్తంగా క్లినిక్‌లపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. నిబంధనలు పాటించని వాటిని సీజ్‌ చేస్తాం. ఆయా ఆర్‌ఎంపీలపై కేసు నమోదుకు సిఫారసు చేస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు ఉన్నారు. ప్రజలు ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తే నాణ్యమైన వైద్యం అందుతుంది.

– ఫైరోజాబేగం, జిల్లా వైద్య,

ఆరోగ్య శాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement