కదం తొక్కిన ఉపాధ్యాయులు
మడకశిర: ఉపాధ్యాయులు కదం తొక్కారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. పట్టణంలో ఆదివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాలను చేత పట్టుకుని ప్రభుత్వ తీరుపై నిరసన గళం వినిపించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణంలో యూటీఎఫ్ జిల్లా 4వ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోకూడదని ప్రభుత్వాన్ని కోరారు. యాప్‌ల భారం తగ్గించాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా పీఆర్‌సీని అమలు చేయడానికి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇలాగే కొనసాగితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఐదు మంది టీచర్లను నియమించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ మోడల్ స్కూళ్ల టీచర్లకు సర్వీస్ రూల్స్ ప్రకటించాలన్నారు.
యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక..
సమావేశంలో భాగంగా యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా భూతన్న,అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా బాబు, సీతాలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా రామక్రిష్ణనాయక్, కోశాధికారిగా లక్ష్మినారాయణ, కార్యదర్శులుగా నరేస్‌కుమార్, నరసింహప్ప, మల్లికార్జున, రవివర్ధన్‌రెడ్డి, బాబు, అమర్, నారాయణరెడ్డి, మురళి, చెన్నకేశవులు, నాగేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్లుగా తాహెర్‌వలి, మహంతేశ్వర్, మేరివరకుమారి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా సునీల్‌కుమార్ ఎన్నికయ్యారు.


