నేడు పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొటారని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలను వారికి సమర్పించుకోవచ్చన్నారు. గతంలో అర్జీలు సమర్పించి పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టరేట్‌కు రాకుండానేmeekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీ సమర్పించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. ఆధార్ కార్డు వెంట తీసుకురావాలన్నారు.
రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోండి
ప్రశాంతి నిలయం: రెవెన్యూ సేవలను ప్రజలకు సులభంగా అందించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ల వారీగా ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తామన్నారు. అడంగల్ సవరణలు, మ్యుటేషన్, 1బీ, పట్టాదారు పాసు పుస్తకాలు, అసైన్‌మెంట్, చుక్కల భూములు, సెక్షన్ 22ఏ తొలగింపు, ఇంటి స్థలం మంజూరు, రస్తా, భూ సేకరణ, శ్మశానం, కొలతలు, జాయింట్ ఎల్‌పీఎం వంటి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. సాదాబైనామా భూమి హక్కుల కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోతీ కేసుల భాగ పరిష్కారం, డాక్యుమెంట్‌లపై స్టాంప్ డ్యూటీని రూ.100గా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తామన్నారు.
రెవెన్యూ సర్వీసెస్
అసోసియేషన్ నూతన కార్యవర్గం
ప్రశాంతి నిలయం: రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి యన్.దివాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హిందూపురం డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్ జిల్లా అధ్యక్షుడిగా, పెనుకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ డిప్యూటీ తహసీల్దార్ గిరిధర్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నారు. అలాగే, ఉపాధ్యక్షులుగా డిప్యూటీ తహసీల్దార్లు ఎం.రవినాయక్, సీనియర్ అసిస్టెంట్ కె.మహబూబ్ బాషా, తహసీల్దార్ కుతిజున్ కుఫ్రా, డిప్యూటీ తహసీల్దార్ చక్రపాణి, సెక్రటరీగా పుట్టపర్తి తహసీల్దార్ బి.వి.కళ్యాణ్ చక్రవర్తి, కోశాధికారిగా కుర్ర శ్రీకాంత్ ఇలా మొత్తం 16 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
నేడు పరిష్కార వేదిక


