ఆగని అక్రమ కేసులు
రొళ్ల: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా రొళ్ల మండల పరిధిలోని రొళ్లగొల్లహట్టి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శ్రీనివాస్, గోవిందరాజు, శివన్న, చిన్నప్పయ్య, బసవరాజు, లక్ష్మణపై ఆదివారం రొళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 21న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. దీన్ని ఓర్వలేని ఓ టీడీపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ గౌతమి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
అక్రమ కేసులు ఎన్ని బనాయించినా భయపడేది లేదని రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు బి.అనంతరాజు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం విలేకరులతో వారు మాట్లాడారు. తమ అధినేత జగన్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నా కేసులు పెడుతుండడం దుర్మార్గమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిది అసలు రొళ్లగొల్లహట్టే కాదని, గ్రామానికి పది కిలో మీటర్ల దూరంలోని ఎల్‌కేపల్లి వడ్రహట్టి అని తెలిపారు. అవేవీ పట్టించుకోకుండా పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. తమ కార్యకర్తలు రొళ్లగొల్లహట్టిలో ఏ ఒక్కరినీ భయాందోళనకు గురి చేయలేదన్నారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు.


