ప్రహరీ మాటున ప్రజాధనం మింగేద్దామని!
● చిలమత్తూరు మండలంలో
‘పచ్చ’ నేత బరితెగింపు
చిలమత్తూరు: ప్రజా ధనాన్ని అడ్డంగా మింగేసేందుకు ఓ ‘పచ్చ’ నేత బరితెగించి చేస్తున్న వ్యవహారం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో టీడీపీ నేత నందీశప్ప బాగున్న ప్రహరీని తొలగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టకుండా ఏకంగా ప్రహరీని కూలదోయడంపై పలువురు మండిపడుతున్నారు. గతంలో వృక్షం కూలి ఒక చోట, ఇటీవల మరో రెండు చోట్ల గురుకుల పాఠశాల ప్రహరీ దెబ్బతింది. ఈ క్రమంలో మరమ్మతుల కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.50 లక్షలు మంజూరైంది. ఇందుకు సంబంధించిన పనులను టీడీపీ నేత నందీశప్పకు అప్పగించారు. అయితే, మరమ్మతులు చేపడితే తక్కువ డబ్బు వస్తుందని భావించిన ‘పచ్చ’ నేత మొత్తం నిధులు కాజేసేందుకు కుయుక్తులకు తెరతీశాడు. ఈ క్రమంలోనే ఏకంగా ప్రహరీని కూలదోసి, తప్పుడు లెక్కల ద్వారా నిధుల దోపిడీకి తెరతీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేత నందీశప్ప లక్షలాది రూపాయల పంచాయతీ నిధులు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. అతడి తప్పులకు పంచాయతీ కార్యదర్శి రామ్లానాయక్ బలయ్యాడనే విమర్శలూ లేకపోలేదు. అలాంటి వ్యక్తి నేడు మళ్లీ ప్రహరీ మాటున ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు యత్నించడం గమనార్హం. ఈ విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణిని వివరణ కోరగా ఆమె స్పందించారు. ప్రహరీ మరమ్మతులు మాత్రమే చేపడుతున్నట్లు తెలిపారు.


