ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకి సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశం మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 158 అర్జీలు అందగా...వాటిని పరిశీలించి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ఏదైనా సమస్యపై అర్జీ అందిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.
టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు
నాకు మా గ్రామంలోని సర్వే నంబర్ 222–3లో 3.55 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నాపై దౌర్జన్యం చేసి పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. నేను కోర్టును ఆశ్రయించగా.. ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినా టీడీపీ నాయకులు నన్ను పొలంలోకి వెళ్లనివ్వడం లేదు. నాపై దయచూపి న్యాయం చేయాలి. – ముత్యాలమ్మ,
తల్లిమడుగుల గ్రామం, కనగానపల్లి
పింఛన్ కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్నా..
షుగర్ వల్ల నా రెండు కాళ్లు పనిచేయడం లేదు. రెండేళ్లుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నా. వికలాంగుల కోటాలో పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకున్నా కనికరించడం లేదు. ఏ పనీ చేయలేని నాకు కుటుంబ పోషణ భారంగా మారింది. మీరైనా (కలెక్టర్) నాపై దయచూపి పింఛన్ మంజూరు చేయించండి.
– కొండయ్య, కదిరి


