చేయని పనులకు బిల్లులు
అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో చేయని పనులకు బిల్లులు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచులకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శులు, ఈఓ (పీఆర్, ఆర్‌డీ), ఎంపీడీఓ, కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు కుమ్మకై ్క 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు స్వాహా చేశారన్నారు. తాడిపత్రి మండలం బోడాయపల్లి పంచాయతీలో చేయని పనులు చేసినట్లుగా రికార్డులు సృష్టించి రూ.6 లక్షల బిల్లులు డ్రా చేశారన్నారు. అలాగే ఆలూరు గ్రామ పంచాయతీలో రూ.13 లక్షలు, వెలమకూరులో రూ.6 లక్షలు, గంగాదేవిపల్లిలో రూ.18 లక్షలు, ఊరుచింతలలో రూ.23 లక్షలు, తేరన్నపల్లిలో రూ.లక్ష, ఇగుడూరులో రూ.9 లక్షలు, భోగసముద్రంలో రూ.25 లక్షలు, దిగువపల్లిలో రూ.లక్ష, చల్లవారిపల్లిలో రూ.5 లక్షలు, గన్నెవారిపల్లిలో రూ.30 లక్షల చొప్పున తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై జ్యుడీషియల్ విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
వ్యవస్థలన్నీ జేసీ కనుసన్నల్లోనే..
తాడిపత్రిలో వ్యవస్థలన్నింటినీ జేసీ ప్రభాకర్‌రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నాడని, ప్రతి అధికారీ ఆయన కనుసన్నల్లోనే పనిచేసేలా హుకుం జారీ చేస్తున్నాడని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్‌లో తాడిపత్రిలో పీపీపీ (ప్రభాకర్‌రెడ్డి, పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్) విధానం తీసుకొస్తారేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని, ప్రతిపక్ష నాయకులను కొట్టినా కొట్టించుకుంటామని, కేసులు పెట్టించుకుంటామని అన్నారు. కానీ సామాన్య ప్రజలనైనా కాపాడాలని అధికారులను కోరుతున్నామన్నారు. పరిశీలిస్తాం అని కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. మరో నాలుగు మట్కా కంపెనీలు పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోరేమో అంటూ ఎద్దేవా చేశారు. విపరీతంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి
కలెక్టర్‌ను కోరిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి


