ఆధిపత్యం కోసం అరాచకాలు
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు నియోజకవర్గంలో ఆదిపత్యం కోసం పరిటాల కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన బి.యాలేరు ఘటన, జగనన్న కాలనీల్లో టీడీపీ నాయకులు ప్లాట్లను కబ్జా చేస్తున్న వైనంపై బాధితులతో కలిసి సోమవారం ఎస్పీ జగదీష్, కలెక్టర్ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. బి.యాలేరులో బండి పరుశురాం అనే రౌడీషీటరును రెచ్చగొట్టి తనపై అసత్య ఆరోపణలు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. రాజకీయ ఆశ, వరుసకు తమ్ముడైన బండి నాగరాజు భూమిని లాక్కొని ఇిప్పిస్తామని ఆశ కల్పించి పరుశురాంతో దుర్మార్గపు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమను ఎత్తుకుని పెంచిన చిట్రా ఓబులేసు, ఇతర కురుబ కులస్తులు ఏళ్ల తరబడి ఆదరించారనే కృతజ్ఞతతో తాము ఏమీ అనలేమనే ధైర్యంతోనే పరుశురాం రెచ్చిపోతున్నాడన్నారు.
కుట్రలో భాగమే..
రామగిరి మండలంలో కురుబ మజ్జిగ లింగమయ్యను పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేష్, ఆయన కుమారుడు హత్య చేశారని కురుబలందరూ విశ్వసిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో బండి పరుశురాంను రెచ్చగెట్టి తమపై ఊసిగొల్పారని, ప్రతి చర్యకు దిగితే దానిని భూతద్ధంలో చూపించాలని పరిటాల కుటుంబం పన్నిన పన్నాగమిదని అన్నారు. ఫ్యాక్షన్‌లో వందల ఎకరాల భూమిని కోల్పోయామని, అలాంటి ఫ్యాక్షన్ జోలికి ఎవరూ వెళ్లకూడదని తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ప్రజాసేవ కోసం రూ. వంద కోట్లు ఖర్చు చేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేను ప్రజలు సునీత బదులు శనితగా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో న్యాయవాది పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, మజ్జిగ శంకరయ్య, మదిగుబ్బ వీరాంజనేయులు, ఓబుగారి హరినాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, నాగార్జున, మారుతీ, వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, రాప్తాడు రామాంజనేయులు, అనంతపురం రూరల్, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు దుగుమర్రి గోవిందరెడ్డి, బండి పవన్, సాకే వెంకటేశు, నాగముని, మీనుగ నాగరాజు, బాలపోతున్న, నాయకులు గొల్లపల్లి విశ్వనాథరెడ్డి, పశుపుల ఆది. జూటూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బండి పరశురాం అనే వ్యక్తిని పావుగా వాడుకుంటున్న పరిటాల కుటుంబం
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పరిటాల కుటుంబ సహకారంతో నన్ను మట్టుబెట్టాలని చూస్తున్న పరశురాం : బండి నాగరాజు
బి.యాలేరు ఘటనపై ఎస్పీ, జగనన్న కాలనీల్లో టీడీపీ నాయకుల కబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి


