సమస్యలతో బేజారు
● పరిష్కారం కాక మళ్లీమళ్లీ వినతులు
● వివిధ సమస్యలపై 467 అర్జీలు
● నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రతి వారం వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. పరిష్కారం కాక ప్రజలు మళ్లీ మళ్లీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, వ్యవసాధికారి ఉమామహేశ్వరమ్మ ప్రజల నుంచి 467 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి.. సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
వినతుల్లో మచ్చుకు కొన్ని...
● తమ కాలనీలో రోడ్లు, కాలువలు లేక ఇబ్బంది పడుతున్నామని అనంతపురం రూరల్ మండలం రామచంద్ర కాలనీవాసులు రవీంద్ర బాబు తదితరులు విన్నవించారు. ఎన్నిసార్లు విన్నవించినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
● ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చూడాలని గుంతకల్లు మండలం గుంతకల్లు తండాకు చెందిన ఎం.శారద విన్నవించారు. భర్త శివనాయక్ ఈ ఏడాది జూన్ 19న మరణించాడని చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలని, తమ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాసులు లేవని తెలిపారు. కూలి పనులు చేసుకుని కష్టంగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.
● ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు రెండేళ్లుగా అందాల్సిన గౌరవ వేతనం విడుదల చేయాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీలు నారాయణరెడ్డి, సి.జయలక్ష్మీ, హేమలత కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.


