జనవరి 3 నుంచి అంతర్ కళాశాలల అథ్లెటిక్స్
అనంతపురం సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ (మహిళలు, పురుషులు) పోటీలు అనంతపురం ఆర్ట్స్ కళాశాల వేదికగా జనవరి 3 నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను జనవరి 12 నుంచి 16వ తేదీ వరకూ కర్ణాటకలోని అల్వాస్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల, మూదబద్రిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పూర్తి వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ శ్రీరామ్ (94933 48808)ను సంప్రదించవచ్చు.
మా కాలనీకి రోడ్డు వేయండి
● దివ్యాంగుల డిమాండ్
అనంతపురం అర్బన్: తమ కాలనీకి రోడ్డు వేయాలంటూ ప్రభుత్వాన్ని అనంతపురంలోని సంత్ గురు రవిదాస్ కాలనీకి చెందిన దివ్యాంగులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి మాట్లాడారు. కాలనీలో 250 ఇళ్లు ఉన్నాయన్నారు. రోడ్డు గుంతల మయం కావడంతో మూడు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏళ్లుగా ఎందరో అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చేపిస్తామంటూ, గెలిచిన తరువాత తమ కాలనీవైపు కన్నెతి కూడా చూడడం లేదని వాపోయారు. ఆందోళన కారులను డీఆర్వో మలోల కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు అర్జీ అందజేసి ప్రస్తుతం మట్టితో గుంతలైన పూడిపించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సహాయకుడు సుధాకర్, నాయకులు వసంతకుమార్, ఈసీ సభ్యులు శ్రీనివాసులు, నరేంద్ర, రాకేష్, మక్బూల్, దివ్యాంగులు పాల్గొన్నారు.


