‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

Dec 30 2025 7:22 AM | Updated on Dec 30 2025 7:22 AM

‘ప్రణ

‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ‘వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక’ను ఉపాధ్యాయులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని డీఈఓ ప్రసాద్‌బాబు ఆదేశించారు. అనంతపురం రూరల్‌ పాపంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ప్రత్యేక ప్రణాళిక ఎలా అమలవుతోందో పరిశీలించారు. పదో తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, స్పెషల్‌ క్లాస్‌కు ఎంత మంది హాజరయ్యారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజూ స్లిప్‌టెస్ట్‌ నిర్వహిస్తున్నారా లేదా.. వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు పిల్లలకు వచ్చిన మార్కులు, వెనుకబడిన విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ పెట్టాలనే అంశాల గురించి సూచనలు ఇచ్చారు.

పోక్సో కేసులో

ముద్దాయికి ఐదేళ్ల జైలు

పుట్టపర్తి టౌన్‌/ధర్మవరం రూరల్‌: ఓ బాలిక ఫొటోలు తీసి అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయికి పోక్సో కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...ధర్మవరం మండలం గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన నరసింహులు మరో గ్రామానికి చెందిన బాలికపై ఈ ఏడాది మే 5వ తేదీన అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు ధర్మవరం రూరల్‌ పోలీసులకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు సోమవారం కోర్టు ఎదుటకు రాగా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 8 మంది సాక్షులను విచారించిన తర్వాత నేరం రుజువు కావడంతో ముద్దాయికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి చిన్నబాబు తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం ద్వారా రూ.75 వేల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ముద్దాయికి శిక్ష పడేలా సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన సీఐ బొజ్జప్ప, సిబ్బంది శ్రీనివాసులు, రామాంజనేయులును ఎస్పీ సతీష్‌కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు.

రాత్రికి రాత్రే భూకబ్జా

బాధితులు లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కుటుంబ సభ్యులు

అనంతపురం సెంట్రల్‌: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరాక భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. కన్ను పడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా టీడీపీకే చెందిన ఏపీ వీర శైవ లింగాయత్‌ వెల్ఫేర్‌, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ స్వప్న కుటుంబ సభ్యులైన విజయకుమారి, రాజశేఖర్‌లకు చెందిన స్థలానికి రాత్రికి రాత్రే ఎవరో కంచె వేసేశారు. దీంతో ఆమె బాధితులను వెంటబెట్టుకొని సోమవారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నగర శివారు తపోవనంలో 179 సర్వే నంబర్‌లో నాగప్ప పేరుతో 43 సెంట్ల భూమి ఉందని, తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తోందని బాధితులు తెలిపారు. ఐదుగురు అన్నదమ్ములకు సంబంధించిన వారసులకు ఈ స్థలం భాగపరిష్కారం చేయాల్సి ఉందని వివరించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి స్థలం చుట్టూ కంచె వేశారని వాపోయారు. తమ భూమిని కాపాడాలని ఎస్పీకి విన్నవించారు.

మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌

మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్‌ మడకశిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తుది గెజిట్‌ బుధవారం జారీ కానున్నట్లు తెలిసింది. మడకశిర రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి మడకశిర, అగళి, రొళ్ల, అమరాపురం, గుడిబండ మండలాలు రానున్నాయి. ప్రస్తుతం ఈ మండలాలన్నీ పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి.

‘ప్రణాళిక’ను  ప్రతిష్టాత్మకంగా తీసుకోండి 1
1/1

‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement