మందు కోసమే మట్టుబెట్టారు | - | Sakshi
Sakshi News home page

మందు కోసమే మట్టుబెట్టారు

Dec 30 2025 8:46 AM | Updated on Dec 30 2025 8:46 AM

మందు

మందు కోసమే మట్టుబెట్టారు

హిందూపురం: కేవలం మందు కోసమే ఈ నెల 25న హిందూపురంలోని కామన్‌ బెడ్డింగ్‌ హౌస్‌లో కర్ణాటక ప్రాంతానికి చెందిన యువకుడిని దారుణంగా హతమార్చారంటూ పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన 8 మందిని సోమవారం అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. వివరాలను వన్‌టౌన్‌ సీఐలు రాజగోపాలనాయుడు, అబ్దుల్‌ కరీం, జనార్ధన్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ వెల్లడించారు.

పట్టుబడింది వీరే..

హత్య కేసులో పోలీసులకు పట్టుబడిన వారిలో కర్ణాటకలోని గౌరీబిదనూరు పట్టణంలోని నశ్రోజీ నగర్‌కు చెందిన సురేష్‌ అలియాస్‌ సూరి, పెద్దిరెడ్డిపల్లి బాలాజీ, బెంగళూరు వాసుకుమార్‌, హిందూపురం బాపూజీనగర్‌ బాలకృష్ణ అలియాస్‌ బాలు, మనోహర్‌ అలియాస్‌ గుండూ, హస్నాబాద్‌ బి.శివకుమార్‌, సోమందేపల్లి మండలం మాగేచెరువు ప్రభాకర్‌, గుద్దగుంటపల్లి రవీంద్ర, అలియాస్‌ రవి ఉన్నారు.

అసలేం జరిగింది?

హిందూపురంలోని కిరణ్‌ బెడ్డింగ్‌ హౌస్‌లో కొంత కాలంగా బస చేస్తున్న కర్ణాటకకు చెందిన డ్రైవర్‌ మహిపాల్‌ (35) ఈ నెల 25న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అంతకు రెండు రోజుల ముందు 23వ తేదీన మహిపాల్‌ బెడ్‌ పక్కనే బెంగళూరుకు చెందిన వాసుకుమార్‌ కూడా బస చేశాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత తన సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో మహిపాల్‌ను వాసుకుమార్‌ అనుమానించాడు. అయితే తనకేమీ తెలియదని మహిపాల్‌ తెలిపినా సుమారు 8 నెలలుగా అక్కడే ఉంటున్న గౌరీబిదనూరుకు చెందిన సురేష్‌తో మాట్లాడాడు. మహిపాల్‌పైనే తనకు అనుమానం ఉందని, తన సెల్‌ఫోన్‌ ఇప్పిస్తే మందు తాపుతానన్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి మహిపాల్‌ను చితక్కొట్టడంతో దెబ్బలు తాళలేక బోయపేటలో ఉందని బుకాయించాడు. 24న సురేష్‌ అదే లాడ్జీలో బసచేస్తున్న స్నేహితులు ప్రభాకర్‌, రవీంద్రతో కలిసి మహిపాల్‌ను వెంటబెట్టుకెళ్లి కేఎల్‌ రోడ్డులోని బాంద్రీషాపు వద్ద దాసరి బాలాజీ, బాలకృష్ణ, సాకే మనోహర్‌. శివకుమార్‌ను కలిశాడు. సెల్‌ఫోన్‌ ఇప్పిస్తే వాసుకుమార్‌ తమకు కావాల్సినంత మందు తాపుతాడని నమ్మబలికి అందరినీ మహిపాల్‌పై ఊసిగొల్పాడు. ఆ సమయంలోనూ మహిపాల్‌ సరైన వివరాలు తెలపకపోవడంతో బాలకృష్ణ బలంగా కొట్టడంతో మహిపాల్‌ తల చీలి రక్తగాయమైంది. అనంతరం బెడ్డింగ్‌ హౌస్‌కు మహిపాల్‌ను చేర్చి మరోసారి ప్రశ్నించారు. అయినా సమాచారం చెప్పలేదంటూ విచక్షణారహితంగా కొట్టడంతో మహిపాల్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బెడ్డింగ్‌ హౌస్‌లోనే పడుకోబెట్టి వెళ్లిపోయారు. 25వ తేదీ ఉదయం హత్య ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ మహేష్‌ నేతృత్వంలో విస్తృత దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో సోమవారం 8 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని రిమాండ్‌కు తరలించారు.

హంద్రీ–నీవా కాలువలో వ్యక్తి మృతదేహం

పుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు వీఆర్‌ఓ వేణు తెలిపారు. సిద్ధరాంపురం గ్రామానికి వెళ్లే మార్గంలో కాలువ బ్రిడ్జ్‌ వద్ద తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించామన్నారు. విషయాన్ని బుక్కపట్నం పోలీసులకు చేరవేశామని, చీకటి పడడంతో మృతదేహం మహిళదా? పురుషుడిదా? అనేది గుర్తించలేకపోయామన్నారు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశముందన్నారు.

పరిష్కార వేదికకు 85 వినతులు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార స్వయంగా వినతులు స్వీకరించి, సమస్య తీవ్రత అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సత్యకుమార్‌ ప్రోద్భలంతో కేసు నీరుగారిస్తున్నారు

మంత్రి సత్యకుమార్‌ పోద్భలంతో కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని తాడిమర్రి మండలం ఎస్పీ సతీష్‌కుమార్‌కు పుల్లంపల్లికి చెందిన దళితులు సాకే ధనుంజయ, గాయత్రి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం పరిష్కార వేదికలో దళిత సంఘాల నేతలతో కలసి ఎస్పీని కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్‌ సందర్భంగా పుల్లంపల్లిలో ప్రార్థనలు చేస్తుండగా మైకు సౌండ్‌ విషయంలో బీజేపీ నేత బోయ గొడ్డుమర్రి నరేంద్ర, అతని అనుచరులు మూకుమ్మడిగా దళితులను దుర్భాషలాడుతూ కాళ్లతో తన్ని, చెప్పులతో కొట్టారని తెలిపారు. క్షతగాత్రులను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకుని తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. మంత్రి సత్యకుమార్‌ ప్రోద్బలంతో పోలీసులు తలొగ్గి కేసును నిర్వీర్యం చేస్తున్నారని, పైగా తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు.

యూపీఐ ద్వారానే డబ్బు చెల్లింపులు

ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌

పుట్టపర్తి అర్బన్‌: సూక్ష్మ సేద్యం పరికరాలకు సంబంధించి రైతుల వాటా సొమ్మును యూపీఐ లింక్‌ ద్వారా చెల్లించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నేరుగా నగదు తీసుకోబోరాదని సంబంధిత అధికారులను ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌ ఆదేశించారు. సోమవారం పుట్టపర్తిలోని ఏపీఎంఐసీ కార్యాలయంలో కంపెనీ డీసీఓలు, ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏఓలతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ట్రెంచ్‌ మార్కింగ్‌, ట్రెంచ్‌ కటింగ్‌, మెటీరియల్‌ సప్‌లై, ఇన్‌స్టాలేషన్‌, సీసీ జనరేషన్‌ ప్రకారం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీడీ ధనుంజయ, అధికారులు, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

వైద్య, ఆరోగ్యశాఖ మినిస్ట్రీయల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మినిస్ట్రీయల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా డీఎంహెచ్‌ఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ బాబా ఫకృద్దీన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ ఆద్వర్యంలో ఈ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. కార్యదర్శిగా జయచంద్ర, కోశాధికారిగా జావేద్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా లక్ష్మీనారాయణతో పాటు మరో ఐదుగురు మంది వైస్‌ ప్రెసిడెంట్లు, ఐదుగురు జాయింట్‌ సెక్రెటరీలు, ఆరుగురు ఈసీ మెంబర్లను ఎన్నుకున్నారు.

వరి పంటకు నిప్పు

తనకల్లు: మండలంలోని రామ్లానాయక్‌తండాలో రైతు భూక్యా రమేష్‌నాయక్‌కు చెందిన వరి పంటకు సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తనకున్న ఎకరా పొలంలో వరి పంటను సాగు చేయగా.. మరో రెండు రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చేతికి వచ్చిన పంటంతా కాలి బూడిదైంది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.

నిందితుడి అరెస్ట్‌

ఓడీచెరువు: సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టిన అనంతపురం జిల్లా శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన నల్లప్ప కుమారుడు కె.నాగేంద్రను అరెస్ట్‌ చేసినట్లు నల్లమాడ సీఐ శ్రీనివాస్‌, ఓడీ చెరువు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం వారు వెల్లడించారు. గతంలో నాగేంద్రపై శింగనమల పీఎస్‌ పరిధిలోనూ రెండు కేసులు నమోదయ్యాయని, అయినా అతనిలో మార్పు రాలేదని తెలిపారు. ఇటీవల మరోసారి మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టడంతో అందిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం కదిరి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు వివరించారు.

ఆటో బోల్తా... వివాహిత మృతి

సోమందేపల్లి: ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... సోమందేపల్లి మండలం చాలకూరు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మహేష్‌, శశికళ (28) దంపతులు. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమార్తె ఉంది. మహేష్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి తాగునీటి కోసమని బిందెలు తీసుకుని భార్యతో కలసి ఆటోలో శివాలయం వద్దకెళుతుండగా ఎదురుగా హిందూపురం వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఘటనలో శశికళ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను స్థానికులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నీట మునిగి విద్యార్థి మృతి

పుట్టపర్తి టౌన్‌: ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కొత్తచెరువు మండలంమీర్జాపురం గ్రామానికి చెందిన ఎరికల సాయమ్మ, శేఖర్‌ దంపతుల కుమారుడు చరణ్‌ (15) తలమర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్పెషల్‌ క్లాస్‌ ఉండడంతో ఇంటి నుంచి బయలుదేరి పాఠశాలకు చేరుకున్నాడు. పుస్తకాల సంచిని పాఠశాల గేట్‌ ఆవరణలో ఉంచి పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలోని బావి వద్దకు బహిర్భూమి కోసమని వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. పుస్తకాల సంచి ఉన్నప్పటికీ విద్యార్థి చరణ్‌ కన్పించకపోవడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చుట్టుపక్కల గాలించారు. బావి గట్టుపై చెప్పులు ఉండడంతో అందులోకి పడి ఉంటాడని భావించి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఫైర్‌ సిబ్బందిని రంగంలో దించి ఫైరింజిన్‌ మోటార్ల సహాయంతో నీళ్లు బయటకు పంపింగ్‌ చేపట్టారు. సాయంత్రం విద్యార్థి మృతదేహం బయటపడింది. తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై సీఐ మారుతీశంకర్‌ కేసు నమోదు చేశారు.

యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ

ఎనిమిది మంది నిందితుల అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన హిందూపురం పోలీసులు

మందు కోసమే మట్టుబెట్టారు1
1/2

మందు కోసమే మట్టుబెట్టారు

మందు కోసమే మట్టుబెట్టారు2
2/2

మందు కోసమే మట్టుబెట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement