మామిడి రైతులకు బీమా పరిహారం అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులకు బీమా పరిహారం అందజేయాలి

Dec 30 2025 8:46 AM | Updated on Dec 30 2025 8:46 AM

మామిడి రైతులకు బీమా పరిహారం అందజేయాలి

మామిడి రైతులకు బీమా పరిహారం అందజేయాలి

ప్రశాంతి నిలయం: గత ఏడాది జిల్లాలో మామిడి పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 49,870 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయన్నారు. 2024–25 ఏడాదికి గాను పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ పంటల బీమా పథకం కింద హెక్టారుకు రూ.4,500 చొప్పున ప్రీమియంను 2,353 మంది రైతులు చెల్లించారన్నారు. రైతు వాటా కింద రూ.90,60,075, కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించలేదని, దీనికి తోడు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాతావరణ సమాచారాన్ని కూడా తమకు ఇవ్వలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని రైతులకు బీమా పరిహారం అందేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబులపతి, వైఎస్సార్‌సీపీ మండల మాజీ కన్వీనర్‌ గంగాద్రి, బుక్కపట్నం మండల ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, నాయకులు దామోదర్‌రెడ్డి, రాఘవరెడ్డి, మాధవరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం చేకూరాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద నమోదైన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. గతంలో నమోదైన అట్రాసిటీ కేసుల స్థితిగతులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా 30న ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని తప్పకుండా నిర్వహించి, చట్టాలు, పౌరహక్కులపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుని బాధితులకు పరిహారం అందించేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, జేసీ మౌర్య భరద్వాజ్‌, ఆర్‌డీఓలు సువర్ణ, మహేష్‌, ఆనందకుమార్‌, వీవీఎస్‌ వర్మ, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రతి శనివారం ‘రెవెన్యూ క్లినిక్‌’

రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘రెవెన్యూ క్లినిక్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. నెలలో మొదటి మూడు శనివారాలు ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో, నాలుగో శనివారం శనివారం కలెక్టరేట్‌లో కార్యక్రమం ఉంటుందన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ల వారీగా అన్ని మండలాలకు ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్‌’ ఏర్పాటు చేసి, మాట్లాడారు.

ఆర్డీఓలు, తహసీల్దార్లు కలిసి ‘రెవెన్యూ క్లినిక్‌’ నిర్వహిస్తారని, దీనివల్ల అర్జీలను వెంటనే పరిష్కరించే వీలు కలుగుతుందన్నారు. అడంగల్‌లో మార్పులు, చేర్పులు, మ్యుటేషన్లు, పట్టాదార్‌ పాసుపుస్తకంలో పేరు మార్పులు, అసైన్మెంట్‌ పట్టా, ఎఫ్‌లైన్‌, జాయింట్‌ ఎల్‌పీఎం, సబ్‌ డివిజన్‌, 22–ఏ చుక్కల భూముల సమస్యలు, రస్తా, శ్మశాన వాటికల సమస్యలు, భూ వివాదాలు, పట్టాదార్‌ పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌ రికార్డుల సవరణ, వారసత్వ నమోదు, ఆక్రమణలపై ఫిర్యాదులు తదితర అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తారన్నారు. సమస్యలను స్థానికంగా ఉండే ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ‘మన మిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా కూడా ప్రజలు ప్రభుత్వ సేవలను వాట్సాప్‌ ద్వారా ఫోన్‌లోనే పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు వన్‌బీ రికార్డులు అందజేశారు. జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, మహేష్‌, వీవీఎస్‌ శర్మ, ఆనందకుమార్‌, పలువురు తహసీల్దార్లు, వీర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement