భద్రత లేని ప్రయాణం
హిందూపురం అర్బన్: వాహనం ఎక్కిన వారు తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకుంటారనుకునే పరిస్థితులు పోయాయి. సరైన భద్రతా ప్రమాణాలు, రహదారులపై సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలో చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు వైకల్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి 544ఈ జాతీయ రహదారితో పాటు 44వ జాతీయ రహదారిపై మరీ దారుణంగా మారింది. జాతీయ రహదారుల్లో మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంది. మూడేళ్ల క్రితం నూతనంగా నిర్మించిన ఎన్‌హెచ్ 544ఈపై చిలమత్తూరు, టేకులోడు మలుపుల వద్ద ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థ పని చేయడం లేదు. లేపాక్షి లోకి వెళ్లే చోట పిల్లగుండ్లు, నవోదయ సమీపంలో మలపుల వద్ద సరైన భద్రతా ప్రమాణాలు లేవు. డివైడర్లను క్రమ పద్దతిలో ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొల్లకుంట వద్ద ఫ్‌లై ఓవర్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం.
మచ్చుకు కొన్ని..
● హిందూపురం నుంచి గోరంట్ల, కదిరి వెళ్లే వాహనదారులు పాలసముద్రం క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిని దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అతివేగంగా వాహనాలు వెళుతుంటాయి. అండర్‌బ్రిడ్జి లేకపోవడంతో అటు వైపు నుంచి వస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి కొడికొండ చెక్‌పోస్టు వద్ద నెలకొంది.
● హిందూపురం–కదిరి రహదారి మరమ్మతుల కారణంగా రోజూ ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రహదారుల మలుపులు వద్ద, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు.
● చిలమత్తూరు సమీపంలోని చేనేపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారి క్రాస్ చేయాలి. అక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ మూడేళ్లలో ఐదుగురు అక్కడ మృత్యువాతపడగా, 12 మంది క్షతగాత్రులయ్యారు.
● చిలమత్తూరు మీదుగా టేకులోడు క్రాస్‌కు వెళ్లే రహదారిలో బైరేకుంట వద్ద మలుపు ఉంది. రహదారి ఓ వైపు దింపుగా ఉండడంతో అటుగా వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 20 రోజుల క్రితం ఇదే మలుపు వద్ద ఓ మహిళ బస్సు నుంచి జారి పడి మృతి చెందింది.
● జాతీయ రహదారి 544ఈ లో చిలమత్తూరు, టేకులోడు మలుపుల వద్ద చిలమత్తూరు రోడ్డుకు కలిపే రోడ్డు వద్ద సరైన జాగ్రత్తలు చేపట్టలేదు. ఏడాది క్రితం కారు ఢీ కొనడంతో చామలపల్లికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి రోడ్డు డివైడర్లు రాత్రి సమయంలో అస్సలు కనిపించవు. ఇక సోలార్ లైట్లు అలంకార పప్రాయమయ్యాయి.
● 44వ జాతీయ రహదారిపై కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, పాలసముద్రం క్రాస్‌ల వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు ఇప్పటికే పలు సర్వేలు చేసినా.. ఆచరణలో అమలుకు నోచుకోలేదు. మూడేళ్లలో ఆరుగురు చనిపోగా.. 8 మంది గాయపడ్డారు. కోడూరు వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు సమీప గ్రామాల వారు ధర్నాలు చేస్తే ఆ సమయంలో స్పందించే అధికారులు... తర్వాత ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
● జాతీయ రహదారులపై ఆటోల నిషేధం ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తరచూ ఆటోలను ఆశ్రయించడం తప్పడం లేదు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తరలిస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
‘ఎన్‌హెచ్ 544ఈ’లో
ప్రమాదకరంగా మలుపులు
ఎన్‌హెచ్ 44లోనూ ఇదే పరిస్థితి
చర్యలు తీసుకుంటాం
జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆర్‌అండ్‌బీ అధికారులు, పోలీసులను సమన్వయం చేసుకుని గుర్తిస్తాం. ఈ క్రమంలోనే ప్రమాదాలపై ప్రజలు అందజేసిన అర్జీలనూ పరిగణనలోకి తీసుకుని కలెక్టర్, ఎన్‌హెచ్ అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రమాదాల నివారణపై చర్యలు తీసుకుంటాం.
– కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణాధికారి


