స్నేహితుడి కుమార్తెపై అత్యాచారయత్నం.. పండంటి కాపురం నాశనం | Attempted Rape Of Friend Daughter In Anantapur - Sakshi
Sakshi News home page

స్నేహితుడి కుమార్తెపై అత్యాచారయత్నం.. పండంటి కాపురం నాశనం

Published Wed, Oct 4 2023 12:32 AM | Last Updated on Thu, Oct 5 2023 11:15 AM

- - Sakshi

అనంతపురం క్రైం: నాన్నతో కలసి ఆయన మిత్రుడు ఇంటికొస్తే ఆత్మీయంగా పలకరించి అన్నం పెట్టిన వివాహితపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమైపె అత్యాచారం చేయబోయాడు. గట్టిగా ప్రతిఘటించడంతో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిన ఆ దుర్మార్గుడు.. చివరకు ఆమె భర్తకు దగ్గరై లోబర్చుకునేందుకు ఎత్తుగడ వేశాడు. దీంతో విషయం కాస్త భర్తకు తెలిసి భార్యకు దూరమయ్యాడు. పండంటి కాపురం కూలిపోయాక అసలు విషయాన్ని దిశ పోలీసులో బాధితురాలు మొరబెట్టుకుంది. వివరాలు...

అనంతపురంలోని లక్ష్మీనగర్‌కు చెందిన ఓ కుటుంబ పెద్దకు కరుడు కట్టిన నేరస్తుడు టెంకాయల రాము స్నేహితుడు. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ వారి ఇంటికి రాము వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలోని యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేసి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. అయితే స్నేహితుడి కుమార్తైపె కన్నేసిన రాము.. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు.

2018లో ఘటన
2018, డిసెంబర్‌ 14న ఉదయం వివాహిత భర్త పనిపై బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న టెంకాయల రాము... ఆమె ఒంటరిగా ఉన్నట్లు నిర్ధారించుకుని, తనకు మంచినీళ్లు కావాలని అడిగాడు. నీళ్లు తెచ్చి ఇచ్చిన ఆమె ఫోన్‌ కోసం పడకగదిలోకి వెళ్లగా వెనుకనే అనుసరించిన రాము బలాత్కరించబోయాడు. ఆ సమయంలో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయం మొత్తం వారితో బాధితురాలు చెప్పుకుని ఏడ్చింది. అయితే రాము కరుడు కట్టిన నేరస్తుడు కావడంతో విషయం వివాదస్పదమైతే తమ ప్రాణాలకే ప్రమాదమని భావించిన కుటుంబసభ్యులందరూ బయటకు చెప్పుకోలేక లోలోనే మదనపడుతూ వచ్చారు. ఈ విషయం భర్తకు తెలిస్తే ఆయన ఎక్కడ అపార్థం చేసుకుని దూరమవుతాడోననే భయం కూడా వారిని వెన్నాడుతూ వచ్చింది.

విషయం తెలిసి దూరమైన భర్త
ఎలాగైనా స్నేహితుడి కుమార్తెను లోబర్చుకోవాలనుకున్న రాము.. చివరకు ఆమె భర్తకు సన్నిహితమవుతూ వచ్చాడు. ఇటీవల ఈ విషయాన్ని గమనించిన ఆమె వెంటనే తన భర్తను హెచ్చరిస్తూ రాముతో కలసి తిరగడం మంచిది కాదని హితవు చెప్పింది. రాము చేసిన దురాగతాన్ని తల్లిదండ్రులతో కలసి వివరించింది. ఆపత్కాలంలో బాధితురాలికి అండగా నిలవాల్సిన భర్త ఆమెను అపార్థం చేసుకున్నాడు.

ఆ రోజునే ఆమెకు దూరమయ్యాడు. నీచుడి ప్రవర్తన కారణంగా తన సంసారం కుప్పకూలడంతో తీవ్ర వేదనకు లోనైన బాధితురాలు గత నెల 25న దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐ చిన్నగోవిందు... సిబ్బంది సాయంతో మంగళవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా తలుపులలో టెంకాయల రామును గుర్తించి అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement