●
ధర్మవరం 4వ వార్డులో 580కి పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేతలను ఆదుకునేందుకు చందబ్రాబు ప్రభుత్వం అట్టహాసంగా అమలు చేసిన ‘నేతన్న సేవలో’ పథకం నిధులు మాత్రం కేవలం ఒక్కరికి మాత్రమే అందాయి. దీంతో మిగిలిన వారంతా రెండో విడతలో దరఖాస్తు చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
బత్తలపల్లి మండలం అప్రాశ్చెర్వు గ్రామంలో పది మగ్గాలున్నా...ఒక్కరంటే ఒక్కరికీ ‘నేతన్న సేవలో’ పథకం సాయం అందలేదు. ఇదే గ్రామంలో 70 మంది దాకా అనర్హులకు నేతన్న సేవలో పథకం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున సాయం బ్యాంకు ఖాతాల్లో జమైంది.
ధర్మవరం: చేనేత కార్మికుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరించింది. వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన ‘నేతన్న నేస్తం’ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ రెండేళ్లు చోద్యం చూసింది. దీంతో చేనేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ ఏడాది చేనేత దినోత్సవం రోజున ‘నేతన్న సేవలో’ అంటూ హడావుడి చేసింది. అయితే అందులోనూ అర్హులైన నేతన్నలకు వెన్నుపోటు పొడిచింది. గత రెండేళ్లతో పాటు ఈ ఏడాది ఆర్థిక సాయంతో కలిపి రూ.75 వేలు ఇస్తారని ఆశగా ఎదురు చూడగా... పథకం ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నామని చెప్పడంతో చేనేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందులోనూ అనర్హులకు పెద్దపీట వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దరఖాస్తులు బుట్టదాఖలు..
జిల్లా వ్యాప్తంగా 12,500 మంది నేతన్నలుంటే.. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 10,500 మంది చేనేతలకు నేతన్న సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25,000 చొప్పున మొత్తం రూ.31.25 కోట్లు సాయం అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. దీన్ని ఇదే అదునుగా చేసుకొని అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అనర్హుల పేరిట దరఖాస్తు చేశారు. అర్హులైన చేనేతల దరఖాస్తులను బుట్టదాఖలు చేశారు. దీంతో పథకం కింద నిధులు విడుదల కాగానే మొదట అనర్హులకే సాయం అందింది.
ఆర్భాటపు ప్రకటనలతో
మభ్యపెడుతున్న మంత్రులు..
నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేతలు వేలాది మందికి సాయం జమ కాలేదు. దీంతో వారు కడుపు మండి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్‌లు అర్హుల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని చేనేత, జౌళీ శాఖ అధికారులను ఆదేశించారు. వారంలోపు సాయం జమ చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి నెలన్నరరోజులవుతున్నా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారు.
అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కు..
‘నేతన్నసేవలో’ పథకంలో కూటమి పార్టీల నాయకులు, చేనేత జౌళీ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది కుమ్మకై ్క పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనర్హులకు సాయం జమ చేసి వారి నుంచి సగం మొత్తం అంటే రూ.12,500 తీసుకుని అర్హులైన చేనేతలకు మొండి చేయి చూపారు. రూ.లక్షలు కొల్లగొట్టినట్లు సమాచారం.
...నేతన్న సేవలో పథకం అమలు తీరుకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే.. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో అమలు చేసిన ‘నేతన్న నేస్తం’ను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్.. రెండేళ్లుగా చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించింది. తాజాగా ‘నేతన్న సేవలో’లో అంటూ పథకం ప్రారంభించినా పచ్చనేతల సిఫార్సులతో అనర్హులకు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేసింది.
‘నేతన్న సేవలో’ అర్హులకు అన్యాయం
వేలాది మంది చేనేతలకు నేటికీ అందని సాయం
కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్న నేతన్నలు
రెండో విడతలో దరఖాస్తు చేసినా అందని ఆర్థిక సాయం


