రొద్దం: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. అనధికార కోతలను అరికట్టాలని, వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రొద్దం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ వర్షాభావంతో పంటలు ఎండిపోయి, రైతులు దారుణ పరిస్థితులు అనుభవిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కరువుతో ప్రజలు అల్లాడుతున్నా కనీసం కలెక్టర్లతో సమీక్ష కూడా చేయలేదని అన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కష్టాలపై పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు.. మళ్లీ తిరిగి అధికారంలోకొచ్చిన తర్వాత అదే నిజమని నిరూపిస్తున్నారు. గత జగనన్న ప్రభుత్వంలో పంటల బీమా ప్రభుత్వమే చెల్లించి రైతులను ఆదుకున్నామన్నారు. ఇప్పుడు రైతుల పరస్థితి ఇంత దారుణంగా ఉన్నా పంట బీమా రైతులే కట్టుకోవాలని ఆదేశాల్విడం రైతుల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. గత ప్రభుత్వంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఏ పంటల కాలంలో ఆ పంటకే సకాలంలో చెల్లించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరైతుకూ ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించిన దాఖలాలు లేవని చెప్పారు. రాయలసీమ ఎత్తుపోతుల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.
జిల్లా మంత్రికి కరువు కనిపించలేదా?
రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నా జిల్లా ఉన్న మంత్రి సవితకు కరువు కనిపించలేదా? అంటూ ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వర్ష పాతం అతితక్కుగా ఉన్నా..రైతులు సాగు చేసిన వివిధ పంటలు ఎండుతున్నా కరువు నివారణకు మంత్రి సవిత ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. హంద్రీ–నీవా ద్వారా పెన్నా నది నుంచి పేరూరు డ్యాంకు నీరు తరలిస్తే దాని ద్వారా రైతుల వ్యవసాయ బోర్లలో సమృద్ధిగా నీరు వచ్చేదన్నారు. తమ హయాంలో పేరూరు డ్యాంకు నీరు తీసుకురావడంతో వ్యవసాయ బోర్లలో నీరు సమృద్ధిగా వచ్చేదని అన్నారు. హంద్రీ నివా కాలు సిమెంట్‌తో బెడ్డింగ్ వేస్తే నీరు ఇంకడానికి వీలు పడదన్నారు. దీంతో బోర్లలో భేగర్భజాలాలు పెరగడానికి వీలు పడదన్నారు. రాయలసీమ ఎత్తుపోతల పథకం ద్వారా సాగు, తాగునీటి ఇచ్చి ఆదుకోవాలని, బకాయిపడిన అన్నదాత సుఖీభ రైతులకు అందజేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, రొద్దం, గోరంట్ల, పెనుకొండ, పరిగి, సోమందేపల్లి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌మూర్తితో మాట్లాడారు. రైతులకు పగటి వేళలో 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సీనియార్టీ ప్రకారం మెటీరియల్ అందించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, వినయ్‌రెడ్డి, జెట్టి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సినిమా నారాయణ, చిలకల రవి, పంచాయతీ కన్వీనర్ ఇస్లాపురం అంజి, ఎస్సీసెల్ శివన్న, శంకర, ఎం.తిమ్మయ్య, పలువురు రైతులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్


