● యువకుడి దారుణ హత్య
నెల్లూరు సిటీ: స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని అశోక్‌నగర్ లండన్ లేఅవుట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ మండలం దొరతోపు కాలనీలో చెన్నయ్య, బుజ్జమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు ప్రేమ్‌చంద్(24) ఐటీఐ చదవి ప్రస్తుతం చైన్నెలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దినేష్, జీషాన్‌లు స్నేహితులు. చందు నెల్లూరుకు వచ్చిన సమయంలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ సరదాగా గడిపేవారు. ఈనెల 10వ తేదీన చందు నెల్లూరుకు వచ్చారు. ఈ క్రమంలో జీషాన్‌తో ఆయనకు గొడవ జరిగింది. దీంతో దినేష్, జీషాన్, మరో వ్యక్తి హేమంత్‌లు ఒక్కటై ఎలాగైనా చందును కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరందరూ అశోక్‌నగర్‌లో మద్యం సేవించే సమయంలో మాటామాటా పెరిగింది. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో వారు చందును విచక్షణారహితంగా పొడిచి హత్యచేసి పరారయ్యారు. శనివారం తెల్లవారుజామున స్థానికులు మృతదేహాన్ని గమనించి నెల్లూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో పాటు నెల్లూరు రూరల్, కోవూరు, నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌లు వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సెల్‌ఫోన్, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ ఆధారాలు సేకరించింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే హత్యకు గంట ముందు నిందితులు స్థానికులతో గొడవకు దిగినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు బైక్‌పై వెళ్తూ వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు అతన్ని ప్రశ్నించగా గొడవ జరిగినట్లు తెలిసింది.


