● 40 లక్షలకుపైగా నగదు, బంగారంతో ఉడాయించిన మహిళ
కొడవలూరు: ఓ మహిళ పదేళ్ల పాటు గ్రామస్తులతో నమ్మకంగా ఉంటూ డబ్బులివ్వడం, తీసుకోవడం చేసేది. ఇలా గ్రామస్తుల వద్ద రూ.40 లక్షలకు పైగా నగదు, బంగారం దండుకుని ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన కొత్తవంగల్లులో శనివారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. సునీత అనే మహిళ పదేళ్ల క్రితం తన కుమారుడు, కుమార్తెతో కొత్తవంగల్లు గ్రామానికి వచ్చి వేముల నారబాబు ఇంట్లో అద్దెకు దిగారు. భర్తతో విభేదాలున్నందున ఇద్దరు పిల్లలతో వచ్చేసినట్లు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఇలా ఆ ఇంటినే కొనుగోలు చేస్తానని చెప్పి ఆయనకు చెక్కులిచ్చి ఇంటిని రాయించుకున్నారు. ఆ కాగితాలను తనఖా పెట్టి రూ.4.10 లక్షల బ్యాంక్ నుంచి రుణం తీసుకుందని బాధితుడు తెలిపారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ఆడిగోవుల రమణయ్య వద్ద 13 సవర్ల బంగారం, రూ.3.50 లక్షల నగదు, మైపాటి ప్రభావతి వద్ద 12 సవర్ల బంగారం, లక్ష నగదు, చిరంజీవమ్మ వద్ద మూడు సవర్ల బంగారం, 25 వేల నగదు, నూర్జహాన్ వద్ద రూ.4.50 లక్షల నగదు, అనూరాధ వద్ద రూ.30 వేలు, రమణమ్మ రూ.10 వేల నగదు వంతున తీసుకున్నట్లు బాధితులు వాపోయారు. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణంతో కలుపుకుంటే రూ.13 లక్షలకు పైగా నగదు, 31 లక్షల విలువైన బంగారంతో ఉడాయించినట్లు ఆవేదన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.


