అడవిలో తప్పిపోయి.. ఆహారం, నీరు దొరక్క | - | Sakshi
Sakshi News home page

అడవిలో తప్పిపోయి.. ఆహారం, నీరు దొరక్క

Sep 13 2026 12:24 AM | Updated on Sep 13 2026 12:24 AM

రాపూరు: అడవిలో తప్పిపోయి.. ఆహారం, నీరు దొరక్క ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని తెగచర్ల గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తెగచర్లకు చెందిన వీరపురెడ్డి నారాయణరెడ్డి (43) ఈనెల 8వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని తండ్రి లక్ష్మీనరసారెడ్డి ఫిర్యాదు చేయడంతో 10వ తేదీన మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. నారాయణరెడ్డికి మతిస్థిమితం సరిగా లేనందున తోటలో నుంచి ఇంటికి వచ్చే క్రమంలో దారి తప్పి అడవిలోకి వెళ్లి ఆహారం, నీరులేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాటర్‌ హీటర్‌ తీసే

క్రమంలో..

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైమ్‌): బకెట్‌లోని వాటర్‌ హీటర్‌ రాడ్‌ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కొండాయపాళెంలోని కావేరి అవెన్యూలో సునీల్‌రెడ్డి(43), రీనా ప్రియదర్శిని దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో వెహికల్‌ ఇన్‌చార్జిగా, భార్య మరో స్కూల్‌లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. రీనా ప్రియదర్శిని శనివారం స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటి బెడ్‌రూమ్‌ కిటికీలో నుంచి పొగలు వస్తున్నాయని ఇంటి ఓనర్‌ ఆమెకు ఫోన్‌చేసి చెప్పారు. ఆ సమయంలో తన భర్త భోజనానికి వచ్చి ఉంటారని భావించిన ఆమె ఫోన్‌ చేయగా స్పందించలేదు. దీంతో ఆమె బంధువులకు, స్కూల్‌లో పనిచేసే సిబ్బందికి తెలియజేశారు. స్కూల్‌ సిబ్బంది ఇంటివద్దకు చేరుకుని విద్యుత్‌వైర్లు కట్‌చేసి, తలుపు స్క్రూలను తొలగించి లోనికి వెళ్లిచూడగా బెడ్‌రూమ్‌లోని మంచం వద్ద సునీల్‌రెడ్డి కాలిన గాయాలతో మృతిచెంది కనిపించారు. అక్కడి స్విచ్‌బోర్డు, బకెట్‌, దిండ్లు, సామగ్రి కాలిపోయి ఉన్నాయి. స్విచ్‌ బోర్డుకున్న వాటర్‌హీటర్‌ రాడ్‌ కొంతమేర కాలిపోయి, బకెట్‌ పూర్తిగా కరిగిపోయి బొగ్గు అయి ఉంది. స్నానం చేసేందుకు వేడినీటి కోసం బకెట్‌లో ఉంచిన వాటర్‌హీటర్‌ రాడ్‌ తీసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో తన భర్త మృతిచెందినట్లు భార్య వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement