నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రిలో రోగులకు అత్యవసర వైద్యసేవలందించేందుకు రూ.23.75 కోట్ల అంచనాలతో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను(సీసీబీ) ప్రారంభించారని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాకుల ప్రారంభోత్సవాన్ని విజయవాడలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ శనివారం వర్చువల్‌గా జరిపారు. నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో జేసీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, అర్ధరాత్రుల్లో జరిగే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు సమగ్ర క్రిటికల్ కేర్ వైద్యసేవలు అందించేందుకు ఈ బ్లాక్ ఉపయోగపడుతుందన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిలు మాట్లాడుతూ ఈ బ్లాకు వల్ల మరో 50 పడకలు అదనంగా ఆస్పత్రిలో చేరాయన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, సభ్యులు మొగరాల సురేష్, బ్రహ్మారెడ్డి, మల్లికార్జున, అబిదా, నేత్ర విభాగం హెచ్‌ఓడీ వసంతకుమారి, గైనకాలజీ హెచ్‌ఓడీ గీతాలక్ష్మి, క్యాజువాలిటీ(ఎమెర్జెన్సీ) హెచ్‌ఓడీ కిరణ్‌లతో పాటు పలువురు మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.


