బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

ఉదయగిరి: మండలంలోని కృష్ణంపల్లికి చెందిన తుపాకుల మహేష్‌, మంజుల దంపతుల కుమారుడు తన్వీష్‌ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 6న సాక్షిలో ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యువనేత మేకపాటి అభినవ్‌రెడ్డి తన వంతు సాయంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అందులో భాగంగా ఆదివారం ఆ మొత్తాన్ని బాలుడి తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా అభినవ్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లోనూ తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లాల కొండారెడ్డి, వింజమూరు మండల పార్టీ అధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ రొడ్డ కొండయ్య తదితరులున్నారు.

బాలుడిని ఢీకొట్టిన కారు

తీవ్ర గాయాలు

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో చాకలకొండ రోడ్డుపై ఆదివారం గుర్తుతెలియని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుల వివరాల మేరకు.. స్థానిక జైభీమ్‌ నగర్‌కు చెందిన మేరిగ ప్రేమకుమార్‌ బీసీ కాలనీ సమీపంలోని ఓ ధాబా వద్ద ఉన్న స్విమ్మింగ్‌ పూల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. అనంతరం తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వింజమూరు వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రేమకుమార్‌ను అక్కడున్న యువకులు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తీసుకెళ్లారు. ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోటార్‌బైక్‌ అదుపుతప్పి..

హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ముత్తుకూరు(పొదలకూరు): మోటార్‌బైక్‌ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం మేరకు.. ముత్తుకూరు రాజీవ్‌ నగర్‌కు చెందిన గుణ్ణం విజయ్‌ ప్రకాష్‌ (55) నెల్లూరు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పని ముగించుకుని శనివారం రాత్రి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో జంగాలకండ్రిగ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో బైక్‌ అదుపు తప్పింది. దీంతో ప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై ముత్తుకూరు ఎస్సై డీవీకే రెడ్డి కేసు నమోదు చేశారు.

నేడు ‘డయల్‌

యువర్‌ ఎస్‌ఈ’

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ పరిధిలో ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని ఎస్‌ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్‌ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పొచ్చు.

● తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్‌ ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్‌కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్‌ చేసి సమస్యలు చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement