అధికారం మాది.. ఏమైనా చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అధికారం మాది.. ఏమైనా చేస్తాం

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

చెరువుల్లో అక్రమంగా మట్టి తరలింపు

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

వెంకటాచలం: మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొందరు టీడీపీ నాయకుల అండతో చెరువుల్లో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. తవ్వకాలతో చెరువుల్లో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల్లో నీరు అంతంతమాత్రంగా ఉండటం కొందరు తెలుగుదేశం న ఆయకులు వరంగా మారింది. జేసీబీ యంత్రాలతో మట్టి తవ్వి లేఅవుట్లు, ఖాళీ ప్లాట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెంకటాచలంలోని కనుపూరు చెరువు, కాకిఎద్దలగుంట, కాకుటూరు, చెముడుగుంట, కసుమూరు తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మట్టి తరలింపు సాగుతోంది. కనుపూరు, కాకిఎద్దలగుంట చెరువుల్లో ఐదు రోజులుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పు మట్టిని రూ.800 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. ట్రిప్పు మట్టి ధర రూ.500 కదా అని కొందరు నివాస ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తే.. తమ ధర ఇంతేనని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.

అధికారుల పట్టింపు ఏదీ?

ఐదు రోజులుగా చెరువుల్లో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, ఇరిగేషన్‌ కార్యాలయాలు ఉండే మార్గంలోనే మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు నిత్యం తిరుగుతున్నా చర్యలు లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నుంచి ముడుపులు అందడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మండలంలోని చెరువుల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకుని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement