● గూడూరు నియోజకవర్గ
సమన్వయకర్త గురువయ్య
చిల్లకూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గూడూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి విచారణ చేపట్టినా స్వాగతిస్తామని వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురువయ్య అన్నారు. గూడూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో హాల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోమిడిలో జరిగిన కార్యక్రమంలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వాటిని వక్రీకరించడం సరికాదన్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన డీఎస్సీ నిరసన ర్యాలీకి అనుమతులు కోరినా పోలీసులు అడ్డుకున్నారన్నారు. అదే డీఎస్సీకి అధికార పార్టీ అనుకూలంగా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు దగ్గరుండి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. గూడూరు మండలం మంగళపూరులో జరిగిన ఫ్లెక్సీ వివాదాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిష్కరించాల్సిందిపోయి రూరల్ సీఐ ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఖాకీ చొక్కా వేసుకుని పచ్చ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కడివేడు రెవెన్యూ పరిధిలో ఎమ్మెల్యే అనుచరులు ఎంత మేర భూములు ఆక్రమించుకున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. చిల్లకూరు, కోట మండలాల్లో క్రిస్ సిటీ భూసేకరణకు సంబంధించి బినామీలుగా తమ పార్టీకి చెందినవారి పేర్లను, తమకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను ప్రభుత్వ భూముల సాగుదారులుగా నమోదు చేయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వాస్తవం కాదా అనడిగారు. గూడూరు రూరల్ పరిధిలోని వెడిచెర్లలో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటూ, పశువులను మేపుకునే భూములను ఇద్దరు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై దళితులు ప్రశ్నిస్తే వారిపైనే కేసులు పెట్టి పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలిచారని విమర్శించారు.
● చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గతంలో పంపిణీ చేసిన భూములు ప్రస్తుతం పెద్దల చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు. సమావేశంలో తొణుకుమాల ఎంపీటీసీ సభ్యుడు జానకిరామ్, నాయకులు అట్ల శ్రీనివాసులరెడ్డి, ఇందుకూరి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


