● కేసును ఛేదించిన పోలీసులు
● 11 సవర్ల బంగారం, రూ.1,80,500 నగదు
స్వాధీనం
ఆత్మకూరు: కేర్ టేకర్‌గా వృద్ధ దంపతులకు సేవలందిస్తున్న ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ జి.గంగాధర్, ఎస్సై జంపానికుమార్ ఆదివారం సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆత్మకూరుకు చెందిన తలసిరి సుబ్బయ్య, ఆయన భార్య వెంకటసుబ్బమ్మలు వృద్ధులు. వారి కుమారుడు హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. తల్లిదండ్రుల కేర్ టేకర్‌గా హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో ఉన్న రామకృష్ణ హోం కేర్ సర్వీసెస్ ద్వారా విజ్జనపు వీర్రాజు అనే వ్యక్తిని నియమించాడు. 20 రోజుల క్రితం అతను ఆత్మకూరులో సుబ్బయ్య ఇంట్లో ఉంటున్నాడు. ఈక్రమంలో నగలు, నగదు, పొలాల ద్వారా వచ్చే కౌలు నగదును బీరువాలో భద్రపరిచడం లాంటి విషయాలు తెలుసుకున్నాడు.
అప్పులపాలై..
మద్యానికి బానిసైన వీర్రాజుకు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల కోసం బీరువాను రాడ్‌తో పగులగొట్టి 11 సవర్ల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు దొంగతనం చేసి జేఆర్‌పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో చెత్త పోగుచేసే దగ్గర దాచాడు. దొంగతనం జరిగిందని గుర్తించిన వృద్ధ దంపతులు కుమారుడికి సమాచారం ఇచ్చారు. అతను ఆత్మకూరుకు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ హడావుడి చూసి వీర్రాజు పరారయ్యాడు. అతడిపై అనుమానంతో సెల్‌ఫోన్ ఆధారంగా నెల్లూరుపాళెం వద్ద బస్సు ఎక్కుతుండగా వీర్రాజును ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 11 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 లక్షల నగదులో సుమారు రూ.19 వేలు ఖర్చు చేయగా, మిగిలిన మొత్తా న్ని స్వాధీనం చేసుకున్నారు. వీర్రాజు కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం జల్లివారిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 24 గంటల వ్యవధిలో చోరీ కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు కేశవకు ఎస్పీ అజిత రివార్డులు ప్రకటించారు.


