నెల్లూరు(అర్బన్): శిశువుల వైద్య సంరక్షణ సేవల్లో దేశంలో పేరుగాంచిన రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి సేవలను నెల్లూరులో ప్రారంభిస్తున్నామని వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తర్వాత తన సొంతూరు నెల్లూరులో నాలుగో బ్రాంచ్‌గా, దేశంలో 24వ బ్రాంచ్‌గా ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామన్నారు. నెల్లూరులోని ప్రైమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశామన్నారు. ఇకపై ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు. ఇప్పుడున్న 70 పడకలను మరింత విస్తృతం చేయనున్నామన్నారు. పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, అంకాలజీ, హెపటాలజి, గాస్ట్రో ఎంటరాలజీ, నియోనేటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ తదితర అనేక రకాల సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రైమ్ రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రీతమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైమ్ ఆస్పత్రిని రెయిన్‌బో క్లినికల్ వ్యవస్థలో విలీనం చేయడం ద్వారా తాము అందించే ఉత్తమ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అన్ని రకాల శిశు సంరక్షణ సేవలకు మెట్రో పాలిటిన్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రైమ్ ఆస్పత్రి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


