అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

నెల్లూరు (టౌన్‌): డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వోదయ కళాశాల సెంటర్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పిచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ లేదా ఐటీఐ, డిప్లొమో లేదా ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఉత్తీర్ణులైన వారు www. braouap.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94931 69101 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

అంగన్‌వాడీ పోస్టులకు

ఇంటర్వ్యూలు రేపు

నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెల 5న ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించన్నుట్లు సీడీపీఓ అరుణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకుని కాల్‌లెటర్లు అందుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. కాల్‌లెటర్లు, ఒరిజినల్‌ ధ్రువీకరణపత్రాలు, జెరాక్స్‌ కాపీలను తప్పక తీసుకురావాలని సూచించారు.

ఆక్రమిత స్థలాన్ని

స్వాధీనం చేసుకుంటాం

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు కావలి–సీతారామపురం జాతీయ రహదారిని పక్కన సర్వేనంబర్‌లో 539/2 లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి షాపుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘ప్రభుత్వ స్థలమే..మనల్ని ఎవరు అడిగేది’ శీర్షికన ఆదివారం కథనం వెలువడడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. సోమవారం వీఆర్వో శిరీష సర్వేయర్‌తో కలిసి అక్రమ కట్టడాన్ని పరిశీలించి స్థలాన్ని సర్వే చేపట్టారు. సుమారు 50 అంకణాల ప్రభుత్వ స్థలంలో ఐదు గదులు నిర్మించినట్లుగా గుర్తించారు. ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

కిలో పొగాకు

గరిష్ట ధర రూ.250

మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. వేలానికి 472 బేళ్లు రాగా, 343 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.160, సగటున రూ.195.01 ధర పలికిందని వివరించారు.

కోటితీర్థంలో అక్రమంగా

చేపల గుంతల సాగు

సీఎంఓకు టీడీపీ మహిళానేత ఫిర్యాదు

రాష్ట్ర మత్స్యశాఖ అధికారుల

రహస్య విచారణపై సందేహాలు

చేజర్ల: మండలంలోని కోటితీర్థంలో అనధికారికంగా చేపల గుంతలను సాగు చేస్తున్నారు. ఈ కారణంగా చిన్న,సన్నకారు రైతులకు చెందిన సారవంతమైన మాగాణి భూములు దెబ్బతింటున్నాయి. ఈ విషయమై బాధితురాలైన టీడీపీ నాయకురాలు కొమ్మి విజయమ్మ గతేడాదిగా న్యాయం కోసం పోరాడుతోంది. పలుమార్లు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గతంలో జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి చేపల గుంతలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ బదిలీపై వెళ్లిన తర్వాత స్థానిక కూటమి నాయకులు, రెవెన్యూ, విద్యుత్‌, ఇరిగేషన్‌, మత్స్యశాఖ అధికారులను చేపల గుంతల యజమానులు తమకు అనుకూలంగా మార్చుకుని అన్ని అనుమతులు ఉన్నాయని కలెక్టర్‌ను సైతం తప్పుదారి పట్టించారు. దీంతో జిల్లాలో న్యాయం జరగదని భావించిన విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు శనివారం కోటితీర్థం వచ్చి చేపలగుంతలను పరిశీలించారు. కాగా రాష్ట్ర అధికారుల పర్యటనను స్థానిక అధికారులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి కమిటీ కోటితీర్థంలో చేపల సాగుకు అనుమతులు లేవని చెబుతుండగా, జిల్లా స్థాయి మత్స్య శాఖ అధికారులు మాత్రం అనుమతులు ఉన్నాయని పేర్కొంటున్నారు. మంత్రి ఆనం ఇలాకాలో అనుమతి లేకుండా చేపలగుంతలు సాగుచేస్తూ చికెన్‌ వ్యర్థాలు, ఇతర రసాయనాలను వినియోగిస్తూ పచ్చని పంట పొలాలను విషతుల్యంగా మార్చి రైతుల పొట్టకొడుతున్న చేపలగుంతల యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మత్స్యశాఖ అధికారుల రహస్య విచారణపై జిల్లా మత్స్య శాఖ జేడీ నాగేశ్వరరావును వివరణ కోరగా నేను కొత్తగా జిల్లాకు వచ్చానని నాకు విషయం తెలియదని బదులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement