● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(బృందావనం): ‘నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ లక్ష్యంగా మారుతున్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు సైబర్ భద్రత రాయబారలుగా మారాలి’ అని ఎస్పీ అజిత వేజెండ్ల పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని పురమందిరంలో ‘సైబర్ భద్రత – సైబర్ సేఫ్టీ’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్, లోన్‌యాప్, ఓటీపీ మోసాలు, ఫేక్ ఇన్విస్టెమెంట్ స్కీమ్‌లు, పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్స్, క్యూఆర్ కోడ్, యూపీఐ, ఏపీకే మోసాలు, ఏఐ డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ తదితర సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, సోషల్ మీడియా ద్వారా బ్లాక్‌మెయిల్ చేయడం ఘటనలు పెరుగుతున్నాయన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్, 112 అత్యవసర సేవలు, సమీప పోలీస్‌స్టేషన్‌లను సంప్రదించాలన్నారు. ‘స్టాప్.. థింక్.. వెరిఫై.. దెన్ యాక్ట్’ సూత్రాన్ని పాటించాలని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
● అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సీహెచ్ సౌజన్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల సైబర్ మోసాలు,వాటి నుంచి రక్షణమార్గాలను వివరించారు. నగర ఏఎస్పీ దీక్ష మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల నమోదైన సైబర్ కేసులను వివరిస్తూ విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తొలుత పురమందిరం నుంచి వీఆర్సీ సెంటర్ వరకు సైబర్ భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వాకాటి విజయకుమార్‌రెడ్డి, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎ.హజరత్తయ్య, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.చంద్రమోహన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


