డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

యువకుడి మృతి

నెల్లూరు(క్రైమ్‌): రోడ్డు దాటుతున్న మహిళను తప్పించే క్రమంలో మోటార్‌బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. నెల్లూరు సౌత్‌ ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని మిలటరీ కాలనీకి చెందిన సాయికుమార్‌ (29) అవివాహితుడు. అతను పడారుపల్లిలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్‌పై మార్కెట్‌కు బయలుదేరాడు. ఫత్తేఖాన్‌పేట వద్ద ఓ మహిళ అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు బైక్‌కు అడ్డం వచ్చింది. ఆమెను తప్పించే ప్రయత్నంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. గాయాలపాలైన సాయికుమార్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువకుడు మృతిచెందాడని నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు సౌత్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయం నిద్రలేచి చూసేసరికి..

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

నెల్లూరు(క్రైమ్‌): అనారోగ్యమో?, పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడనో స్పష్టమైన కారణం తెలియదు గానీ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం నిర్మలా నగర్‌కు చెందిన అనుదీప్‌ సాయి (22) ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి చిన్నతనం నుంచి వినికిడి లోపం ఉంది. ఇటీవల పరీక్షల్లో పలు సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్‌ అయ్యాడు. మంగళవారం రాత్రి స్నేహితుడిని కలిసి 11 గంటలకు ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. బుధవారం తెల్లవారుజామున తల్లి నిద్రలేచి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతుండటాన్ని గమనించింది. వెళ్లి చూడగా కుమారుడు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేసింది. ఇద్దరూ కలిసి సాయిని కిందకు దించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అనుదీప్‌ సాయిని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

మార్కెట్లోకి బ్రెజ్జా కారు విడుదల

నెల్లూరు(బృందావనం): వాహనాల తయారీలో ఎంతో పేరు, ప్రతిష్టలు కలిగిన మారుతి సుజుకి ది న్యూ బ్రెజ్జా నూతన కారును నెల్లూరు మార్కెట్లోకి బుధవారం విడుదల చేసింది. నగర సమీపంలోని విష్ణు కార్స్‌ మోటార్‌లో స్థానికులు, బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కస్టమర్లు దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ షోరూం ఏజీఎం గిరిష్‌ మాట్లాడుతూ మారుతి నుంచి అతితక్కువ ప్రారంభ ధర రూ.7,39,000లతో కారు వచ్చిందన్నారు. 5 స్టార్‌ రేటింగ్‌, సూపర్‌టర్బో బూస్ట్‌ జెట్‌ ఇంజిన్‌, 6 గేర్ల ఫీచర్లతో విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మారుతి సుజుకి అరేనా షోరూం ఎస్‌ఎం మస్తానయ్య, ఏఎస్‌ఎం కృష్ణ, విష్ణు కార్స్‌ షోరూమ్‌, టీం సిబ్బంది, నగరంలోని ప్రముఖులు, బ్యాంక్‌ ఫైనాన్షియర్లు, వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement