నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. విస్తరణకు నోచుకోని రహదారులు, రోడ్లపైకి చొచ్చుకొచ్చిన ఆక్రమణలు, ఇష్టానుసారంగా చేసే పార్కింగ్‌లు, ఎక్కడపడితే అక్కడ ఆగే ఆటోలు, సిటీ బస్సులు, ప్రధాన రహదారులపైనే ఏర్పడిన ఆటో స్టాండ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల నిర్లక్ష్యం నగర ట్రాఫిక్‌ను అస్తవ్యస్తంగా మార్చుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి జరగకపోవడంతో నగరవాసులు రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన జంక్షన్లు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ సెంటర్, ట్రంక్ రోడ్డు, హరనాథపురం జంక్షన్, ఆత్మకూరు బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ సాధారణంగా మారింది. చిన్న ఆటంకం ఏర్పడినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంటోంది.
ప్రమాదాల ముప్పు
వ్యాపార కేంద్రమైన స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధితో పాటు ప్రధాన వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు, మద్యం దుకాణాల వద్ద రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఇప్పటికే ఇరుకుగా ఉన్న రహదారులు మరింత కుంచించుకుపోతున్నాయి. ఫుట్‌పాత్‌లు కూడా ఆక్రమణలకు గురికావడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలోనూ పలు లోపాలు కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. కొన్ని కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నప్పటికీ రద్దీని సమర్థంగా నియంత్రించలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. రాంగ్‌రూట్‌లో రాకపోకలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనలను పాటించకపోవడం, నడిరోడ్డుపైనే ప్రయాణికులను ఎక్కించడం, దించడం వంటి చర్యలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.
ట్రాఫిక్ రద్దీ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, అత్యవసర సేవల కోసం ప్రయాణించే వారు రోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం వృథా కావడంతో రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడం మరో సమస్యగా మారింది. ఉన్నవారిపైనే అధిక పనిభారం పడుతుండటంతో అన్ని ప్రాంతాల్లో సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, ప్రధాన రహదారులను విస్తరించడం, అక్రమ పార్కింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం, ఆటోలు, సిటీ బస్సులకు ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని పెంచడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలని వారు ప్రభు త్వాన్ని, సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
నెల్లూరులో రోడ్ల ఆక్రమణలు
ఇష్టారాజ్యంగా చేస్తున్న పార్కింగ్‌తో
తీవ్ర ఇబ్బందులు
రద్దీలో చిక్కుకుంటున్న అంబులెన్స్‌లు
శాశ్వత పరిష్కారం కోరుతున్న
నగరవాసులు
సిబ్బంది లేక..


