● వాహనాలను అడ్డుకున్న
ఏరూరు గ్రామస్తులు
చిల్లకూరు: తీర ప్రాంతంలో చేపడుతున్న సాగరమాల రహదారి, క్రిస్‌సిటీలో మౌలిక వసతుల పనుల కోసం మట్టి, గ్రావెల్, ఇసుక, బూడిద తరలించే భారీ వాహనాల వల్ల వరగలి క్రాస్ రోడ్డు నుంచి గుమ్మళ్లదిబ్బ వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు బురదమయం అవుతోంది. ఈ క్రమంలో ఏరూరు గ్రామానికి చెందిన మహిళలు బుధవారం రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి ఆర్‌అండ్‌బీ అధికారులు కనీసం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. దీంతో అడుగుకో గుంత ఉందని, ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో దుమ్ము లేచి శ్వాసకోశ వ్యాధులు బారిన పడుతుండగా, వర్షాలు కురిస్తే గుంతల్లో నీరు నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గతంలో గుమ్మళ్లదిబ్బ వరకు గూడూరు ఆర్డీసీ డిపో నుంచి ఐదు బస్సులుండగా నేడు ఒకదానితో నాలుగు ట్రిప్పులు వేస్తున్నారన్నారు. పలుమార్లు వాహనాలను అడ్డుకుంటే నాయకులు వచ్చి దుమ్ము లేవకుండా నీరు చల్లుతామని చెప్పడం ఆ తర్వాత పట్టించుకోపోవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. సాగరమాల రహదారి నిర్మాణం చేపడుతున్న మూడు కాంట్రాక్ట్ సంస్థల ద్వారా ఈ రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు.


