గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని.. పచ్చ సైకోలు అభినవ దుశ్శాసనుల్లా చెలరేగిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ధ్వజమెత్తారు. నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించిన అనంతరం పూజిత మాట్లాడారు. మహిళలపై దాడులు, దుశ్శాసన పర్వాలు, హత్యలు, లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడుతున్న వారందరూ టీడీపీ ముసుగేసుకున్న పచ్చ సైకోలేనని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల మొదలుకొని రాష్ట్ర హోం మంత్రి వరకు అందరూ నేరస్తులను అండగా ఉండటంతో పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా తారుమారు చేస్తున్నారని దుయ్యబట్టారు. కావలిలో ఎస్టీ మహిళను గత నెల 19న వివస్త్రను చేసి పచ్చ నేతలు దారుణంగా కొట్టారని, ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. నాడే కఠిన చర్యలను చేపట్టి ఉంటే గుంటూరు, బద్వేల్‌లో ఘటనలు చోటుచేసుకునేవి కావని చెప్పారు. బాధితులను టీడీపీ మహిళా నేతలు పరామర్శించకపోవడం.. పచ్చ సైకోల చర్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. ఘటనలను కప్పిపుచ్చేందుకు సర్కార్ యత్నిస్తోందని ఆరోపించారు. వారి అరాచకాలను ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
వరుస ఘటనలతో అభద్రత
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో మహిళల్లో అభద్రతాభావం నెలకొంటోందని చెప్పారు. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు చంద్రబాబుతో సహా కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అతివలకు భద్రత, మనోధైర్యం, సాధికారత కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు. దిశ యాప్, చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో బయట ధైర్యంగా తిరిగేవారని, అయితే ప్రస్తుతం ఇవేవీ లేవని విమర్శించారు.
హోం మంత్రి రాజీనామా చేయాలి
మహిళల మాన, ప్రాణాలను రక్షించలేని నీచమైన స్థితిలో ప్రభుత్వం ఉందని పార్టీ రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి మండిపడ్డారు. ఈ రెండేళ్లలో కుప్పం నుండిచి కురుపాం వరకు పూటకో దాడి జరిగిందని ఆరోపించారు. కేంద్ర నివేదిక ఎన్సీఆర్బీ ప్రకారం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఘటనల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, న్యాయం జరగాలంటే హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రక్షణకు చర్యలు శూన్యం
రాష్ట్రంలో పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వెంకటగిరి పరిశీలకులు కోడూరు కల్పలతారెడ్డి మండిపడ్డారు. ప్రతి స్టేషన్ పరిధిలో నేరగాళ్ల చిట్టానైనా బయటపెడితే కనీసం ప్రజలైనా తెలుసుకొని తమను తాము కాపాడుకుంటారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు పెద్ద పీటేశారని తెలిపారు.
పాలనను గాలికొదిలారు
రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికొదిలి.. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేసేందుకు సర్కార్ శ్రద్ధ చూపుతోందని పార్టీ జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద విమర్శించారు. ఇదే శ్రద్ధ మహిళల రక్షణకు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. రోజుకో దాడి జరుగుతున్నా, కనీస స్పందన లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటగా చూస్తున్నామని చెప్పారు. నగర మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
అరాచక శక్తులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం
వైఎస్సార్సీపీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత
మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఎలాంటి చర్యల్లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారని అరుణమ్మ ఆరోపించారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వంలో మొదటి ఘటన చోటుచేసుకున్నప్పుడే చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటివి జరిగేవి కావని చెప్పారు.


