● విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
కోట: కోటలో బీఆర్ అంబేడ్కర్ గురుకులం మూసివేతతో విద్యార్థులు రోడ్డున పడ్డారని, వారికి న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం వారు గురుకుల పాఠశాల, కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు అప్పగించిన క్రమంలో విద్యార్థులను పలు గురుకులాల్లో సర్దుబాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లుతో తల్లిదండ్రులు వాదనకు దిగారు. ఒక్కసారిగా పిల్లల్ని బయటకు పంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పేరెంట్స్ కమిటీకి చెప్పకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా అధికారులు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు.
దళిత సంఘాల మద్దతు
విద్యార్థుల తల్లిదండ్రులకు బహుజన యూత్‌ఫోర్స్ సభ్యులు మద్దతు తెలిపారు. 39 ఏళ్ల చరిత్ర కలిగిన గురుకుల పాఠశాలను ఎత్తివేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. సమైక్యంగా పోరాడి నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.


