● కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
● 372 వినతుల అందజేత
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో వ్యయ, ప్రయాసలకోర్చి నెల్లూరుకు వచ్చాం. మా సమస్యలు విని పరిష్కరించండి’ అని పలువురు బాధితులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు స్వీకరించారు. 372 మంది అర్జీలు అందజేశారు. ఆఫ్‌లైన్‌లో మరో 60 మంది వినతులు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులపై చర్యలేవి?
జిల్లాలో పలుచోట్ల హౌసింగ్ అధికారులు లూజ్ సాయిల్ ఉండే చోట్ల ఇళ్లు నిర్మించారని బీజేపీ సీనియర్ నాయకుడు మిడతల రమేష్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 718 మంది ఇళ్లు పనికిరావని తేలిందన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.


