సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ‘ప్రైవేట్‌పరం’ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ‘ప్రైవేట్‌పరం’

Jul 21 2026 12:05 AM | Updated on Jul 21 2026 12:05 AM

ఇటీవల జీఓ నంబర్‌ 396ను విడుదల చేసిన ప్రభుత్వం

దీనిపై డాక్యుమెంట్‌ రైటర్ల ఆగ్రహం

జీవనోపాధి కోల్పోతామని ఆందోళన

పీపీపీ విధానంతో ఆస్తుల భద్రతపై సందేహాలు

నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను ప్రైవేట్‌పరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. జీఓ నంబర్‌ 396 ద్వారా ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో డాక్యుమెంట్‌ రైటర్లు జీవనోపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్ల తరబడి..

జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వాటిపై ఆధారపడి దాదాపు రెండు వేల మంది డాక్యుమెంట్‌ రైటర్లు, స్టాంప్‌ వెండర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు జీవనం సాగిస్తున్నారు. ఆస్తుల క్రయ, విక్రయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లదే కీలకపాత్ర. ఏళ్ల తరబడి వందలాది మంది రైటర్లు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మార్టిగేజ్‌, వివాహ ధ్రువీకరణపత్రాల తయారీలో వారి శ్రమ ఉంటుంది. లబ్ధిదారులు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి వారధిగా పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి అనుభవంతో పనిచేస్తున్న వీరిని పక్కనపెట్టి ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తే పారదర్శకత లోపించే అవకాశం ఉంది. ప్రజల ఆస్తి వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

జీఓ నంబర్‌ 396ను వ్యతిరేకిస్తూ సోమవారం నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రార్‌ కార్యాలయం(ఆర్‌ఓ) ఎదుట డాక్యుమెంట్‌ రైటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాము ఏళ్ల తరబడి ఈ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రైవేట్‌కు రిజిస్ట్రేషన్‌ సేవలను అప్పగించి తమ పొట్టకొట్టొద్దని కోరారు.

జీఓను రద్దు చేయాలి

భూముల రిజిస్ట్రేషన్‌ విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. జిల్లాలో వేలాది మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడతారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిపడతాయి. ప్రభుత్వం పునరాలోచించి జీఓను రద్దు చేయాలి. – పట్నం దుర్గేష్‌బాబు,

జిల్లా డాక్యుమెంట్‌ రైటర్ల సంఘ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement