సంక్షోభంలో పొగాకు రైతులు | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో పొగాకు రైతులు

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

ధరలు పెంచుతామన్న ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి?

పంటకు గిట్టుబాటు ధర

కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

మర్రిపాడు: రాష్ట్రంలో వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవడం లేదని, పొగాకు ధరల పతానికి, నిలకడ లేని ధరలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మండలంలోని డీసీపల్లి పొగాకు విక్రయ కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌తో వేలం ప్రక్రియ, ధరల తగ్గుముఖం తదితర విషయాలపై చర్చించారు. పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం తీసుకునేలా చూడాలంటూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు పతనమవుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు కనీసం రూ.200లకు కూడా కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉందని, అయినా దానిని పండించే రైతు మాత్రం నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. డీసీపల్లి వేలం కేంద్రంలో 100 రోజులు పూర్తయినా కేవలం 17 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేయడం ఆందోళనకరమన్నారు. ఇంకా 83 శాతం పొగాకు రైతుల గోదాముల్లోనే ఉండిపోవడం చూస్తే కొనుగోలు ప్రక్రియ ఎంత మందగమనంగా సాగుతుందో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలల్లో కేవలం 32 మిలియన్‌ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు.

50 శాతం పొగాకు తిరస్కరణ

రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాల్లో 50 శాతానికి పైగా బేళ్లను ’నో బిడ్‌’ పేరుతో తిరస్కరిస్తున్నారని, రైతు శ్రమకు తగిన విలువ ఎందుకు దక్కడం లేదన్నారు గతేడాది బ్రైట్‌ పొగాకుకు రూ.280 నుంచి రూ.360 వరకు ధర లభించగా, ప్రస్తుతం రూ.160 వరకు పడిపోవడం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందన్నారు. ప్రస్తుతం బ్రైట్‌కు సగటున రూ.243, మీడియం రూ.216, లో గ్రేడ్‌కు రూ.187 మాత్రమే వస్తోందని, కనీసం బ్రైట్‌కు రూ.300, మీడియం రూ.280, లో గ్రేడ్‌కు రూ.250 ధర వస్తేనే రైతు గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రస్తుతం ధరల నేపథ్యంలో చిన్నరైతులు రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో

కిలో గరిష్ట ధర రూ.456

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు ధర కిలోకు గరిష్టంగా ఒక సీజన్‌లో రూ.456 వరకు నమోదైందని, కరోనా సమయంలో కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.200 కోట్లు కేటాయించి రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పొగాకు బోర్డు రైతుల ప్రయోజనాలను కాపాడేలా పనిచేస్తోందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రకాశం, నెల్లూరు సహా అన్ని పొగాకు జిల్లాల రైతులతో కలిసి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిశీలకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, కూనం సుధాకర్‌రెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్‌ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులనాయుడు, బొర్రా సుబ్బిరెడ్డి, పట్టణ కన్వీనర్‌ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, రవీంద్రబాబు, శ్రీనివాసులరెడ్డి, నారాయణస్వామి, కృష్ణారెడ్డి, నారసింహారెడ్డి, కన్నపనాయుడు, చెన్నకృష్ణారెడ్డి, నూనె ప్రసాద్‌, గురవారెడ్డి, జయరామిరెడ్డి, మెట్టుకూరు సుబ్బారెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, బాల అంకయ్య, శ్రీనివాసులరెడ్డి, అశోక్‌, రవికుమార్‌ రెడ్డి, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement