టీసీలు ఇచ్చేయండి.. వెళ్లిపోతాం | - | Sakshi
Sakshi News home page

టీసీలు ఇచ్చేయండి.. వెళ్లిపోతాం

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

నెల్లూరు(టౌన్‌): నెల్లూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందన్న విమర్శలున్నాయి. పాలిటెక్నిక్‌ విద్యతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలనే ఆశతో ఇతర జిల్లాల నుంచి వందలాది మంది విద్యార్థినులు ఇక్కడ చేరుతున్నా, వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. హాస్టల్‌ భవనం శిథిలావస్థకు చేరడంతో ద్వితీయ, తృతీయ సంవత్సరం వారికి వసతి లేకుండా పోయింది. దీంతో పీజీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ వసతులు, భద్రత సరిగా లేకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా కొందరు టీసీలు తీసుకుని ఇతర జిల్లాల్లోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీసీలు పొందడంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు.

మొత్తం 450 మంది

జిల్లాలో ఉన్న ఏకై క ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల నెల్లూరులోని దర్గామిట్టలో ఉంది. ఇక్కడ కంప్యూటర్‌, ఈసీఈ, సీసీపీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 60 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తుండగా, మూడేళ్లకు కలిపి సుమారు 450 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ప్రతి ఏడాది అదనంగా 10 శాతం మేర ఆరు సీట్లు కేటాయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి తొలి విడత కౌన్సెలింగ్‌ ద్వారా ఇప్పటికే 120 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించారు.

హాస్టల్‌ ఇలా..

కళాశాల ప్రధాన హాస్టల్‌ భవనం శిథిలావస్థకు చేరడంతో అందులో విద్యార్థినులను ఉంచడం లేదు. ప్రస్తుతం చిన్న భవనంలో కేవలం ప్రథమ సంవత్సరం వారికే హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థినులు బయట పీజీల్లో ఉండాలని కళాశాల ప్రిన్సిపల్‌ తెలియజేశారు. వారు చేసేదేమీ లేక పక్కనే ఉన్న పీజీలో చేరారు. అక్కడ వసతులు బాగోలేవని, నెలకు రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నప్పటికీ భోజనం నాణ్యతగా లేదని విద్యార్థినులు వాపోతున్నారు. ఒక చిన్న గదిలో ఐదుగురు నుంచి ఆరుగురిని ఉంచుతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో భద్రతపై కూడా ఆందోళన నెలకొన్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా కొందరు టీసీలు తీసుకుని ఇతర జిల్లాల్లోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరుతున్నారు. విద్యార్థినులు ఉంటున్న పీజీ యాజమాన్యానికి, కళాశాల సిబ్బందికి సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

నిర్లక్ష్యంగా సమాధానం

ఇతర కళాశాలల్లో ప్రవేశాల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో టీసీల కోసం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. సిబ్బంది సమయానికి రావడం లేదని, వచ్చినా కొద్దిసేపటికే ఇతర పనుల పేరుతో వెళ్లిపోతున్నారని తెలిసింది. టీసీ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. బుధవారంలోపు ఇతర కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ను కలిసి విన్నవించుకున్నా ‘సమయం పడుతుంది.. కూర్చోండి’ అనే సమాధానమే వస్తోందని వెల్లడిస్తున్నారు.

శిథిలావస్థలో మహిళా పాలిటెక్నిక్‌ హాస్టల్‌ భవనం

ద్వితీయ, తృతీయ సంవత్సరం

విద్యార్థినులకు వసతి లేదు

పీజీల్లో ఉండాలని

కళాశాల సిబ్బంది సూచన

భద్రత, వసతులపై తల్లిదండ్రుల ఆందోళన

టీసీలు తీసుకుని ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్న వైనం

నేటి వరకే అడ్మిషన్ల గడువు, టీసీల కోసం పడిగాపులు

పీజీ అధ్వానం..

అందుకే టీసీ అడిగాం

నా కుమార్తె మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో వసతి లేకపోవడంతో పక్కనే ఉన్న పీజీలో చేర్చాం. అక్కడ భోజనం, వసతులు అధ్వానంగా ఉండటంతో కడప మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలకు ట్రాన్స్‌ఫర్‌ చేయించాం. టీసీ కోసం మంగళవారం ఉదయం నుంచి కళాశాలలో ఎదురు చూస్తున్నాం. పీజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొదటి నెలకు రూ.4 వేలు చెల్లించాం. రెండో నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నందున రూ.2 వేలు తీసుకుని మిగిలిన రూ.2 వేలు తిరిగి ఇవ్వాలని కోరినా అంగీకరించలేదు.

– జగదీష్‌, విద్యార్థిని తండ్రి, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement