ఉదయగిరి: పట్టణంలోని యాదవ బజారుకు చెందిన మట్ల మహేష్ (28) అనే యువకుడు మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మహేష్‌కు ఆరేళ్ల క్రితం ఉదయగిరికి చెందిన కల్యాణితో వివాహమైంది. అతను ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి సంతానం లేదు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. మహేష్ రోజూ మద్యం తాగొచ్చేవాడు. మంగళవారం మధ్యాహ్నం తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆమె ఎప్పుడూ ఉండే గొడవే కదా అని భావించి టైలర్ షాపులో దుస్తులు కుట్టించుకునే పనిలో నిమగ్నమైంది. సాయంత్రం తిరిగొచ్చి చూడగా మహేష్ ఉరేసుకుని ఉన్నాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మహేష్ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


