నెల్లూరురూరల్/కోవూరు/ఉదయగిరి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పార్టీకి తీరనిలోటని మాజీ మంత్రులు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వారు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన యోధుడిగా, కాపు సామాజికవర్గ హక్కుల కోసం నిరంతరం ఉద్యమించిన నాయకుడిగా పద్మనాభం నిలిచారన్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు.
ఫోన్‌పే పేరుతో మోసం
ఉదయగిరి: ఓ వృద్ధుడిని ఫోన్‌పే పేరుతో మస్కా కొట్టించి ఓ వ్యక్తి రూ.50 వేలు కాజేసిన ఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మర్రిపాడు మండలం నెర్ధనంపాడుకు చెందిన మార్తాల నాగిరెడ్డి నగదు అవసరమై ఉదయగిరి స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద రూ.5 వేలు నగదు ఉందని, ఫోన్‌పే చేయాలని అడిగాడు. నాగిరెడ్డి తనకు రాదని నీవే చేసుకోమని నగదు తీసుకుని సదరు వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. అతను రూ.50 వేలు ఫోన్‌పే చేసుకుని వెళ్లిపోయాడు. మోసపో యానని గ్రహించిన నాగిరెడ్డి ఎస్సై బండ్లపూడి మహేంద్రకు ఫిర్యాదు చేశాడు. ఆయన 1930 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఖాతా నుంచి బ్యాంక్ లావాదేవీలను నిలిపివేయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ షెడ్యూల్లో మార్పు
నెల్లూరు(అర్బన్): వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో సర్ ప్రక్రియ షెడ్యూల్లో భారత ఎన్నికల సంఘం మార్పు చేసిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎల్‌ఓలు బుధవారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరిస్తారు. 24వ తేదీలోపు పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరిస్తారు. 31న సవరించిన ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 28లోపు నోటీసులు జారీ చేస్తూ స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఫైనల్ ఓటర్ జాబితాను అక్టోబర్ 10న ప్రచురిస్తారు.


