చిల్లకూరు: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో బీఎల్‌ఓలకు స్థానికంగా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఆయా పార్టీలు గుర్తింపునిచ్చిన బీఎల్‌ఏలు మాత్రమే సహకారం అందించి సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే మంగళవారం సర్ ప్రకియలో చిల్లకూరు మండలం తొణుకుమాల అధికార పార్టీ నాయకులు సచివాలయంలో కూర్చుని బీఎల్‌ఓల వద్ద తమకు అనుకూలంగా ఉండే వారి ఓట్లను డిజిటలైజేషన్ చేయించుకోవడం కనిపించింది. దీంతో ప్రతిపక్షానికి చెందిన బీఎల్‌ఏలు అడ్డుకోవడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. బీఎల్‌ఏలు కాని వారిని బీఎల్‌ఓలు కూడా ఎలా అనుమతి ఇస్తారని పలువురు విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లినా కనీసం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్ ప్రక్రియను మరో పది రోజులు పొడిగించిన క్రమంలో చివరి రోజుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాల్సి ఉంది.


