● ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరురూరల్: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల అపరిష్కృత డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా చైర్మన్ మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడు ఏవీ రమణయ్య, రాష్ట్ర కోచైర్మన్ చిట్టేటి రమేష్ హాజరయ్యారు. ఏవీ రమణయ్య మాట్లాడుతూ ఫ్యాప్టో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేశారని, ప్రభుత్వం ఇప్పటికై నా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర కో చైర్మన్ చిట్టేటి రమేష్ మాట్లాడుతూ 12వ పీఆర్‌సీని వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న టెట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. జిల్లా చైర్మన్ మధుసూదనరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెక్రటరీ జనరల్ జావీద్ మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన నాయకులు, ఉపాధ్యాయులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్లు మురళీకృష్ణ, మాస ప్రసాద్, మాధవరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ నరసింహం, వీవీ శేషులు, దశరథ్, గురవయ్య, మురళీధర్, లక్ష్మయ్య, మణి సుబ్బు, రాజశేఖర్, పిచ్చిబాబు, సురేంద్ర, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


