● రోజంతా గాలించినా
ఒక్క చేప కూడా దొరకని పరిస్థితి
● నిరాశతో ఖాళీ బోట్లతో ఒడ్డుకు
చేరుకుంటున్న మత్స్యకారులు
వాకాడు: గడిచిన పది రోజులుగా సముద్రంపై హోరుగాలి వీస్తుండడంతో చేపల వేట సజావుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు వాతావరణం కొంత సహకరించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. దీంతో జిల్లాలోని తీర గ్రామాల మత్స్యకారులు బతుకుదెరువుకు అల్లాడిపోతున్నారు. మత్స్యకారులు సముద్రంపై 3 నుంచి 8 నాటికల్ మైళ్లు దూరం వరకు వెళ్లి వ్యయ ప్రయాసలతో రోజంతా గాలించినా వలకు ఒక్క చేప కూడా పడడం లేదని శ్రమతోపాటు డీజిల్ కూడా ఖర్చు అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ మత్స్యకారులు ఖాళీ వల చేత పట్టుకుని నిరాశతో వెనుతిరిగి ఒడ్డుకు చేరుతున్నారు. వేట విరామం తరువాత అరకొరగా సాగుతున్న వేట కాస్త నేడు మరింత దీన స్థితికి చేరింది. ఆశించినంత మత్స్యసంపద దొరక్కపోవడంతో కొందరు మత్స్యకారులు చిన్న చిన్న ఉప్పు కాలవలు, పులికాట్ సరస్సుల్లో వేట చేసుకుని పీతలు, రొయ్యలు, మొయ్యబుడమ చేపలు పట్టుకుని పూట గడుపుకుంటున్నారు.
ఈనెల 17న ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్
నెల్లూరురూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17న ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఆరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధిపతులు తమ శాఖల్లోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు ఈ విషయాన్ని తెలియజేసి, ఉద్యోగులు తమ వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సమక్షంలో సమర్పించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్–2026కు సంబంధించి దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు www. deo. nellore.50 webs. com లో సంప్రదించాలన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 75,836 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,361 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


