● రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ రవిబాబు
నెల్లూరు రూరల్: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వంటేరు రవిబాబు సూచించారు. సోమవారం ఆయన జిల్లాకు విచ్చేశారు. చెముడుగుంట జెడ్పీ హైస్కూల్, పంచాయతీ కార్యాలయం, విక్రమ సింహపురి యూనివర్సిటీ, విద్యుత్ భవన్, డీఈఓ కార్యాలయం, జిల్లా పరిషత్, డీపీఓ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కోర్టు, జిల్లా రిజి స్ట్రార్ కార్యాలయం, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, డీఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ చట్టం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమాచార హక్కు దరఖాస్తుల నమోదు, పరిష్కారానికి సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఇతర పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులో పరిష్కరించి, పూర్తి సమాచారాన్ని అందించడం ప్రజా సమాచార అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అధికారి వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిర్లక్ష్యంపై అసహనం
చట్టం అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిన చెముడుగుంట జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌పై కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చట్టం నిబంధనలకు అనుగుణంగా అన్ని రికార్డులను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు.


